ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ అధికార, ప్రతిపక్షాలపై మాత్రమే ఫైర్ అవడం చూశాం. ఈసారి జనసేనాని ఏకంగా పార్టీ సైనికులకే కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన నాయకులు కాలేమని, కాస్త ఇగోలు తగ్గించుకుని పనిచేస్తే అందరికీ మంచిదని హితవు పలికారు.నెల్లూరు రొట్టెల పండగకు వచ్చిన జనసేనాని పార్టీ కార్యకర్తలతో ఓ హోటల్ లో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో ఓ మహిళా కార్యకర్త తన ఆవేదన చెప్పుకుంది. నిజంగా పార్టీ కోసం పనిచేసి వారికి సరైన గుర్తింపు రావడం లేదని, పవన్ వస్తున్నాడని తెలిసి ఈరోజు చాలామంది హడావుడి చేస్తున్నారని ఆమె లేచి మాట్లాడింది. అప్పటికే లోకల్ పార్టీ పాలిటిక్స్ పై కాస్త అసహనంగా ఉన్న పవన్ కల్యాణ్ స్వరం పెంచారు.ఎవరికి వారు ఇగోలతో పార్టీకి నష్టం చేయొద్దని చురకలంటించారు. అభిమానులొక్కరితోనే ఏదీ కాదని, అందర్నీ ఆహ్వానించాలని, కలుపుకొని పనిచేయాలని అన్నారు. "అభిమానులూ కాస్త తగ్గండి, తగ్గి అందర్నీ కలుపుకొని వెళ్లండి, అంతేగాని ఇగోలతో విడిపోవద్దు, పార్టీనుంచి ఎవర్నీ విడదీయొద్దు అప్పుడే పార్టీ బాగుపడుతుంది" అని హితబోధ చేశారు.నిజానికి జనసేనకు ఏ జిల్లాలోనూ సరైన నాయకత్వం లేదు. క్యాడర్ ఉన్నా అందర్నీ ఏకతాటిపై నిలిపి ముందుకు నడిపించే వారు లేరు. ఎవరికి వారే జనసేన నాయకులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారు, గ్రూపులు కడుతున్నారు. ఉన్నట్టుండి హైదరాబాద్ వెళ్లి పవన్ చేత పార్టీ కండువా కప్పించుకుని తిరిగొచ్చి మేమే సిసలైన నాయకులం అని బిల్డప్ ఇస్తున్నారు. అప్పటి వరకూ పవన్ పేరుతో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ఫ్యాన్స్ వీరిని చూసి ఉడుక్కుంటున్నారు. పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇదే తంతు. నెల్లూరు జిల్లాలో ఇది కాస్త ఎక్కువగా ఉంది. సిటీ నియోజకవర్గానికి టికెట్లు ఆశిస్తున్న యువ నేతలు కొంతమంది ఇప్పటికే హడావుడి మొదలు పెట్టారు. ఎవరికి వారే ఫ్లెక్సీ రాజకీయాలకు తెరతీశారు. జనాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లిన తర్వాత నెల్లూరు జిల్లాకు తొలిసారిగా వచ్చిన పవన్ కు ఈ వర్గాలు, ఫ్లెక్సీ రాజకీయాలు చిరాకు తెప్పించాయి. అందుకే కాస్త గట్టిగానే అభిమానులకు క్లాస్ పీకారు పవన్ కళ్యాణ్.