మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతదేహాలకు సోమవారం శవపరీక్ష పూర్తిచేశారు. కిడారి మృతదేహాన్ని పాడేరుకు, సోమ మృతదేహాన్ని భట్టివలసకు తరలించారు. వీరికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వీరి హత్యను నిరసిస్తూ వివిధ సంఘాలు రెండు రోజులపాటు అరకు బంద్కు పిలుపునివ్వంతో మన్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మన్యంలోని అన్ని ప్రాంతాలను గ్రేహౌండ్స్ దళాలు జల్లెడ పడుతున్నాయి. అల్లర్లను నివారించడంలో విఫలమయ్యారంటూ డుబ్రిగూడ ఎస్ఐ అమ్మన్ రావును డీజీపీ ఆర్పీ ఠాకూర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు మంత్రులు గంటా శ్రీనివాసరావు,చిన రాజప్ప, నక్కా ఆనందబాబు దివంగత ఎమ్మెల్యే కు నివాళులర్పించారు.