గరుడసేవను శ్రీవారి వాహనసేవల్లో కెల్లా ముఖ్యమైందిగా పేర్కొంటారు. బ్రహ్మోత్సవాల్లో జరిగే గరుడసేవను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో శ్రీవారికి గరుడసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం పౌర్ణమి కావడంతో శ్రీవారికి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని ప్రశస్తి. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గం ప్రాప్తించి, ఇహపరమైన ఈతిబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.గరుడసేవతోపాటు శ్రీవారి మూడో నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం కూడా మంగళవారం నిర్వహించనున్నారు. శ్రీవారి భక్తితత్వాన్ని వ్యాప్తిచేసిన ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలకు విస్తృతంగా ప్రచారం చేసేందుకు పౌర్ణమి గరుడసేవ సందర్భంగా నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా దాదాపు 230 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల నుంచి పారాయణదారులు విచ్చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆస్థానమండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం నిర్వహిస్తారు. పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి విచ్చేసి తమ సందేశాలిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నాదనీరాజనం వేదికపై దివ్యప్రబంధ గోష్ఠిగానం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో పండితులు దివ్యప్రబంధ పారాయణం చేస్తారు. రెండేళ్లు నుంచి నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం నిర్వహిస్తుండగా, ఇదివరకు వేద మహోత్సవం, భజనమేళా లాంటి కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించేవారు.