దేశంలో పెట్రో ధరలు త్వరలోనే సెంచరీ దాటే సూచనలు కన్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ పెట్రో కంపెనీలు ధరలను పెంచుతూనే ఉన్నాయి. సోమవారం ముంబయిలో పెట్రోల్ ధరలు తొలిసారి ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకుంది. ఇవాళ లీటర్ పెట్రోల్ ధరపై రూ.11 పైసలు పెరగడంతో ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.90మార్క్‌ను అందుకుంది. మరోవైపు డీజిల్‌పై రూ.5పైసలు పెంచినట్లు భారత ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.74.02గా ఉంది. ముంబయి నగరంలో చమురు సంస్థలు వేర్వేరుగా తమ ధరలను అమలు చేస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీఎల్) తన కంపెనీ ఔట్‌లెట్లలో గరిష్ఠంగా రూ.90.08.. హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్) సంస్థ రూ.90.17.. భారత్ పెట్రోలియం(బీపీసీఎల్) రూ.90.14 ధరలతో పెట్రోల్‌ను విక్రయిస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరల్ని దాదాపూ రోజూ పెంచుకుంటూ పోతున్న సంగతి విదితమే.