అమెరికాలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. సాయంత్రం 6 గంటలకు డీప్ ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ.. ముఖ్య కార్యనిర్వాహక అధికారి లిజ్ టేలర్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. సముద్ర గర్భంలో నిక్షిప్తమైన సంపదను కనుగొనే సాంకేతిక పరికరాల తయారీ సంస్థగా డోయర్ మెరైన్ పేరొందింది. డోయెర్ సంస్థ రూపొందించే సాధనాలపై చంద్రబాబు దృష్టి సారించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌తో చంద్రబాబు భేటీకానున్నారు. రాత్రి 7:30కి రిటైల్ బ్యాంకింగ్ సంస్థ బీఎన్‌పీ పరిబాస్ సీఈవో... జీన్ లారెంట్ బొన్నాఫేతో సీఎం సమావేశం కానున్నారు. అంతేకాకుండా ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్‌తో, రాక్ ఫెలర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.
రాత్రి ఒంటిగంట తర్వాత ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగే కీలక సదస్సులో సీఎం పాల్గొననున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిదిమంది ప్రముఖులలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరు కావడం విశేషం. సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు.