YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

5 వేల కోట్ల మోసంలో నితీన్

5 వేల కోట్ల మోసంలో నితీన్
విజయ్‌మాల్యా మార్గంలో వెళ్లేవారికి దేశంలో కొదవ లేదు. కింగ్‌ఫిషర్‌ను ఎలా పట్టుకుందామా అని సర్కారు బుర్రగోక్కుంటుండగానే నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీ వేలకోట్లు బ్యాంకుకు టోకరా వేసి పరాయిసీమలకు పారిపోయి దర్జాగా తిరుగుతున్నారు. ఇప్పుడు అలాంటిదే మరో కేసు వెలుగులోకి వచ్చింది... సేమ్ స్టోరీ నేమ్స్ డిఫరెంట్ అన్నట్టు. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ యజమాని నితిన్ సందేశారా రూ.5000 కోట్లు బ్యాంకులకు టోపీవేశారు. ప్రభుత్వం లెక్కతేల్చుకుని అమ్మదొంగా అనేలోపల అతడు దుబాయ్‌లో ఉన్నట్టు తేలింది. అక్కడి ప్రభుత్వం ఆయనను అదుపులోకి తీసుకున్నదని సర్కారుకు సమాచారం అందింది. కానీ ఇప్పుడు నితిన్ కుటుంబంతో సహా నైజీరియా చేరుకున్నట్టు సీబీఐ, ఈడీ వర్గాలు తెలిపాయి. ఆ దేశంతో భారత్‌కు నేరస్థుల అప్పగింత ఒప్పందం లేదు. అంటే అతడిని అప్పగించమని మన సర్కారు అడగడం కుదరదు. దుబాయ్‌లో నితిన్‌ను అదుపులోకి తీసుకున్నారన్న వార్తలో నిజం లేదని ఓ అధికారి పేర్కొన్నారు. ఆ వార్త వెలువడేందుకు ముందే కుటుంబంతో సహా నితిన్ నైజీరియాకు తుర్రుమన్నాడని తెలిసింది. అక్కడయితే క్షేమమని తెలిసే వెళ్లి ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. వడోదరా కేంద్రంగా పనిచేసే స్టెర్లింగ్ బయోటెక్‌పై, దాని డైరెక్టర్లు, నితిన్, చేతన్, దీప్తి సందేశారా, రాజ్‌భూషణ్ ఓంప్రకాశ్ దీక్షిత్, విలాస్ జోషి, చార్టర్డ్ అకౌంటెంట్ హేమంత్ హాథీ, ఆంధ్రాబ్యాంకు మాజీ డైరెక్టర్ అనుప్ గార్గ్‌తో సహా పలువురిపై బ్యాంకులకు రూ.5వేల కోట్లు టోకరా వేశారంటూ సీబీఐ, ఈడీ కేసు నమోదు చేశాయి. ఢిల్లీకి చెందిన వ్యాపారి గగన్ ధవన్, గార్గ్‌లను గత జూన్‌లో అరెస్టు చేసి రూ.4700 కోట్ల విలువ చేసే కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. కానీ విదేశాలకు పెద్దఎత్తున నిధులను మళ్లించిన సందేశారాలపై క్రిమినల్ విచారణ నడపడం ముఖ్యమైమన విషయమని అధికారులు అంటున్నారు. 300కు పైగా నకిలీ కంపెనీలు పెట్టి వారు నిధులను దేశం దాటించారని ఆరోపణలున్నాయి. అసలు సందేశారా కుటుంబీకులు భారత పాస్‌పోర్టు మీదే వెళ్లారా లేక మరేదైనా దేశం పౌరసత్వం తీసుకున్నారా అనేది కూడా తెలియదు. ఇకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు భారత దర్యాప్తు సంస్థలు ఒకవేళ కనిపిస్తే పట్టుకోమని దుబాయ్ సర్కారుకు ఓ విజ్ఞప్తిని పంపుతాయట. నైజీరియాలో ఉన్నారంటే దుబాయ్‌కి లేఖ రాయడం ఏమిటో.

Related Posts