YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

జ్వరాల పంజా

జ్వరాల పంజా

కరీంనగర్ :

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నెలకొన్న అపరిశుభ్ర పరిసరాలు ప్రజలను జ్వరాల బారిన పడేస్తున్నాయి. ఈ పరిస్థితులతో పెరుగుతున్న దోమలు జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో పాటు వర్షాల మూలంగా నీరు నిలువడం, చెత్త చెదారం పేరుకుపోవడంతో దోమలు పెరిగి రాత్రీ పగలు అనే తేడా లేకుండా కాటేస్తున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ సమీక్ష జరిగినప్పుడు జ్వరాలను తగ్గించేందుకు, దోమల నివారణకు డ్రైడేలు చేపట్టాలన్న ఆదేశాలు మొక్కుబడిగా అమలవుతున్నాయి. జ్వరాలకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ యంత్రాంగం ఈ ఏడాది విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది కేవలం డెంగీ, మలేరియాకే పరిమితం కాగా ఈసారి చికెన్‌ గున్యా, వైరల్‌ జ్వరాల తీవ్రత విపరీతంగా పెరిగింది. కుటుంబంలో ఒక్కరికి జ్వరం వస్తే అది తగ్గేలోపే మొత్తం కుటుంబాన్ని మంచాన పడేస్తోంది. జ్వరంతో పాటే రక్తకణాలు తగ్గడం విపరీతమైన ఒళ్లు, కీళ్లనొప్పుల మూలంగా లేవలేని పరిస్థితుల్లో జ్వరాలతో రోజుల తరబడి మంచాలకే పరిమితం అవుతున్నారు. వారం పాటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందినప్పటికీ జ్వరం తగ్గినా ఒళ్లు, కీళ్ల నొప్పులు తగ్గక కొన్ని రోజుల పాటు రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. నిత్యం కూలీకి వెళ్లే కుటుంబాలు ఈ జ్వరాలతో పడరాని పాట్లు పడుతున్నారు. చికిత్సకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుండటంతో ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. గతేడాది నగరంలోని 26కు పైగా కాలనీలు మలేరియా జ్వరాల బారిన పడగా, ఈ ఏడు దాదాపు ఇంటికొకరు అన్న రీతిలో వైరల్‌, గున్యా, డెంగీ జ్వరాలతో బాధపడుతున్నారు. గణేశ్‌నగర్‌, రాంపూర్‌, కోతిరాంపూర్‌, భగత్‌నగర్‌, రాంనగర్‌, రాంచంద్రాపూర్‌కాలనీ, సప్తగిరికాలనీ, విద్యానగర్‌, మోతాజుఖానా, సుభాష్‌నగర్‌, కాపువాడ, హౌజింగ్‌బోర్డుకాలనీ తదితర కాలనీల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. శివారు కాలనీల్లో చికెన్‌గున్యా, వైరల్‌ జ్వరాలు మరింత దయనీయంగా మారాయి. అపరిశుభ్ర పరిసరాలు, ఖాళీ ప్రదేశాల్లో పేరుకుపోతున్న చెత్త, కదలని మురుగు తదితర కారణాలతో దోమలు వ్యాప్తి చెంది స్వైరవిహారం చేస్తున్నాయి. కనీసం యంత్రాంగం జ్వరాల తీవ్రత గల ప్రాంతాల్లో పర్యటించి ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయకపోగా, నగరపాలక సంస్థ కూడా దోమల నివారణ చర్యలకు వెనుకడుగు వేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జ్వరాలు, దోమల తీవ్రత గల ప్రాంతాల్లో కనీసం ఫాగింగ్‌ చేపట్టడం లేదని, మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడం లేదని పేర్కొంటున్నారు. జిల్లాలో చికెన్‌ గున్యా, డెంగీ జ్వరాల బారిన పడ్డవారు ఎక్కువ మంది జిల్లా కేంద్రం ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో వార్డులు కిటకిటలాడుతున్నాయి. జ్వర పీడితుల సంఖ్య పెరగడంతో వరండాల్లోనే మడత మంచాలు వేసి వైద్యం అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సరైన వైద్యం అందకపోవడం ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆసపత్రుల్లోనూ కొన్ని రోజులుగా నిండిపోతున్నాయి. జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో చొప్పదండి, గంగాధర, కొత్తపల్లి, హుజురాబాద్‌, జమ్మికుంటల్లో మాత్రమే కొంతమేర వైద్యం అందుతున్నా.. మిగిలిన ఆసుపత్రుల్లో జ్వరం వచ్చిందని తెలియగానే ఆసుపత్రుల వైద్యులు సాధారణ వైద్యం అందించకుండా కరీంనగర్‌ ఆసుపత్రికి సిఫారసు చేస్తున్నారు. నగరంలోని అయిదు అర్బన్‌ వైద్య కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వపరమైన అన్ని ఆసుపత్రుల్లో రక్తపరీక్షలతో పాటు తగిన వైద్యం అందించేలా చర్యలను అధికార యంత్రాంగం చేపట్టాల్సిన అవసరం ఉంది.

Related Posts