జనసేన ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టింది. పార్టీని విస్తరించేందుకు సమాయత్తమవుతోంది. అయితే ఈ ఎన్నికల్లో జనసేన టార్గెట్ ఏంటి..? ఎలా స్టెప్ వేయబోతోంది..? ఇప్పటికే టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అంటున్నాయి. మరి టీడీపీని , ప్రతిపక్ష వైసీపీని బలంగా ఎదుర్కొని నిలబడుతుందా..? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పవన్ టార్గెట్ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే పక్కా స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే ఎన్నికల్లో దిగాలని చూస్తున్నారు పవన్. ఈ క్రమంలో జనసేనపై ఇరు పార్టీల నేతలు ఓ కన్నేసి ఉంచుతున్నారు. కదనరంగంలోకి దూకేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఓ ప్లాన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. ఇప్పటికే స్ట్రాటజీతో పాటు టార్గెట్ కూడా రూపొందించినట్లు సమాచారం. కొన్నిరోజులుగా రెస్ట్ లో ఉన్న పవన్ కల్యాణ్.. ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించి అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. మరోవైపు ఎన్నికల కోసం పావులు కదుపుతూ విస్తరించేందుకు సమాయత్తమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వేలు చేయించుకుంటున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ కు చెందిన రెండు యూనివర్సటీల సిబ్బంది, కొందరు స్థానిక నేతలతో సర్వేలు చేయించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల కోసం జనసేన అధిష్టానం వేట మొదలుపెట్టింది.గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన .. ఈ ఎన్నికల్లో ఒంటరిపోరుతోనే సత్తా చాటాలని చూస్తోంది. అయితే అధికారమే లక్ష్యంగా కాకుండా కొన్ని సీట్లు దక్కించుకుని కింగ్ మేకర్ కావాలని పవన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఎలాగైనా 40 సీట్లు దక్కించుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు సమాచారం. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తానని ఇప్పటికే ప్రకటించిన పవన్ కల్యాణ్.. కనీసం 35 నుంచి 40 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఉభయగోదావరి జిల్లాల్లో 14 స్థానాలు గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలో 8 సీట్లు గెలిచినా.. రాయలసీమలో మరో 8 సీట్లు.. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 10 సీట్ల వరకు దక్కించుకోవాలని భావిస్తోంది. అధికారంలోకి రాకపోయినా ప్రజా సమస్యలపై నిలదీసేందుకు ఈ సంఖ్య సరిపోతుందని పవన్ భావిస్తున్నారు. ఇందుకోసం గ్రౌండ్ లెవల్లో ఇప్పటికే వర్క్ ప్రారంభించేశారు.ఏపీలో ఇప్పటికే ఎన్నికల సందడి నెలకొంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలోనే పార్టీ నిర్మాణం జరిగినా .. ఈ ఎన్నికల్లోనే పోటీ చేయాలని నిర్ణయించుకుంది జనసేన. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న జనసేన.. ఈరెండు పార్టీలతో తలపడి అధికారం దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అందుకే ముందుగా మెజార్టీ సీట్లైనా దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల్లో 40 సీట్లు దక్కించుకుంటే మాత్రం జనసేన కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీరోల్ పోషించే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పవన్ నిర్ణయాత్మక శక్తిగా మారడం ఖాయం. మిగతా ఏపార్టీ అయినా 60 సీట్లు దక్కించుకుంటే జనసేన ప్రభుత్వ భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు సగం అధికారంలో ఉన్నట్టే. కర్ణాటకలో కుమారస్వామిలా .. ఏపీలోనూ అలాంటి ఫార్ములా తయారుచేయాలన్నది పవన్ ప్లాన్. టార్గెట్ రీచ్ అయ్యేలా ఇప్పటికే బలమైన అభ్యర్థుల కోసం జనసేనవేట మొదలుపెట్టింది. 50 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను దింపాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ నియోజకవర్గాల్లో సర్వేలు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ ఎవరిని పోటీకి దింపితే విజయం వరిస్తుందో, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు ధీటుగా జనసేనలోకి ఎవరిని తీసుకోవాలన్న దానిపై కూడా చర్చలు మొదలు పెట్టింది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో పవన్ టార్గెట్ 40 స్థానాలేనని, ఆ నియోజకవర్గాల్లోనే పవన్ ఎక్కువగా ప్రచారం చేస్తారన్నది పార్టీ వర్గాల టాక్. మరి పవన్ అనుకున్నట్టు టార్గెట్ రీచ్ అవుతారా..? ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ అవుతారా అన్నది తెలుసుకోవాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.