సోదరుడి కంటే కుమారుడికే ఆయన విలువ ఇస్తున్నట్లుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో తెలియదు. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు, తర్వాత రేగిన చిచ్చు చల్లార లేదు. ప్రధానంగా ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ ఇటీవల సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా అనే పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. శివపాల్ తన కొత్త పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. కొత్త పార్టీ జెండా మీద ములాయం సింగ్ యాదవ్ ఫొటోను ఉంచి తన సోదర ప్రేమను చాటుకున్నారు.శివపాల్ యాదవ్ పార్టీ పెట్టడం వెనక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఉన్నారని సమాజ్ వాదీ పార్టీ గత కొంతకాలంగా ఆరోపిస్తూనే వస్తుంది. అసలు శివపాల్ యాదవ్ భారతీయ జనతా పార్టీలో చేరాలని భావించారని, కాని బీజేపీ నేతల సూచన మేరకే సొంత పార్టీ పెట్టారని అఖిలేష్ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కొత్త పార్టీపై నేతాజీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తన సోదరుడు పార్టీ పెట్టినట్లు తనకు తెలియదని మాత్రమే ములాయం చెప్పారు. తాను సోదరుడు శివపాల్ తో మాట్లాడిన తర్వాతనే స్పందిస్తానన్నారు పెద్దాయన.అయితే ఉన్నట్లుండి సమాజ్ వాదీ పార్టీ సైకిల్ ర్యాలీ ముగింపు సభలో ములాయం సింగ్ యాదవ్ పాల్గొనడం చర్చకు దారితీసింది. ములాయం సింగ్ యాదవ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. తండ్రీకొడుకులు వేదిక పైనే ముచ్చటించుకోవడం కన్పించింది. గత కొన్ని రోజుల నుంచి ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లు కలసి కూర్చుని మాట్లాడుకుంది లేదు. ఒక వేదికను పంచుకుందీ లేదు. తాజా పరిణామాలతో ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ కే మద్దతు పలికారని సమాజ్ వాదీ పార్టీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు.నిజానికి ములాయం, శివపాల్ యాదవ్ లు రామలక్ష్మణులంటారు. శివపాల్ తన అన్నకు అత్యంత ఆప్తుడిగా ఉంటూ వచ్చారు. ములాయం రెండో వివాహం చేసుకున్నప్పుడు కూడా శివపాల్ అన్నకు మద్దతుగా ఉన్నారు. ములాయం చేతిలో పార్టీ ఉన్నంత వరకూ శివపాల్ యాదవ్ అన్ని చూసేవారు. కార్యకర్తల బాగోగుల నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శివపాల్ యాదవ్ కృషి చేశారు. ములాయం కూడా శివపాల్ తనకు అత్యంత ఇష్టుడిగా పలు సందర్భాల్లో చెప్పారు. కాని లోక్ సభ ఎన్నికల వేళ శివపాల్ యాదవ్ కొత్త పార్టీ పెట్టడాన్ని ములాయం తప్పు పట్టినట్లు తెలిసింది. పరోక్షంగా బీజేపీకి సహకారం అందించినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. అందుకే కుమారుడు అఖిలేష్ వెంటే ఉండాలని ములాయం నిర్ణయించుకున్నట్లుగా కన్పిస్తోంది.