ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయపరిణామాలపై 'జనసేన'తో ఎవరికి లాభం..ఎవరికి నష్టం అనే దానిపై నాయకులు అంతర్మథనం చెందుతున్నారు. ముఖ్యనాయకులందరూ మౌనం వహిస్తుండగా..నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో దీనిపై రసవత్తరమైన చర్చ జరుగుతోంది. అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపా నేతలు ఏయే నియోజకవర్గాల్లో 'జనసేన' ప్రభావం పంత వరకు ఉంటుందో ఆరా తీస్తున్నారు. తెలుగుదేశం, వైకాపాల పార్టీల తరుపున పోటీ చేసే అవకాశం లభించదని భావిస్తున్నవారు 'జనసేన'లో చేరిపోతున్నారు. జనసేన పార్టీ ఒక కులానికే పరిమితం అవుతుందా..? లేక రెండు కులాలకు పరిమితం అవుతుందా..? అనే దానిపై ఆ పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. పవన్ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏ పార్టీల బలం ఎంత అని...తమ సన్నిహితుల ద్వారా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు వైకాపా,టిడిపిలో కొనసాగిన యువనాయకులు 'జనసేన'లో చేరిపోయారు. దీనివల్ల ఏ పార్టీకి ఎంత నష్టం అనే విషయంపై చర్చ జరుగుతోంది. రెండు జిల్లాల్లో పలునియోజకవర్గాల్లో ముఖ్యంగా గ్రామాల్లో భవిష్యత్ ఎన్నికల్లో పోటీ ఎలా ఉంటుంది..? ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు..అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై కొందరు అధికారుల ద్వారా మీడియా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం కాపు సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో 'జనసేన,టిడిపిల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, 'జగన్' పార్టీ అభ్యర్థులు మూడో స్థానానికి పరిమితం అవుతారని అంటున్నారు. ఆ సామాజికవర్గ ఓటర్లు తక్కుగా ఉంటున్న నియోజకవర్గాల్లో టిడిపి, వైకాపాల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంటున్నారు.కాపు యువత ఎక్కువగా 'జనసేన' వైపు ఉండగా..మిగతా వారు టిడిపివైపు మొగ్గుచూపుతున్నారు. 'జగన్'కు కాపుల్లో 10శాతం ఓట్లు కూడా లభించే అవకాశం లేదని వైకాపా నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. నిన్నా..మొన్న వైకాపాలో ఉన్న కాపు యువనాయకులు ఇప్పుడు 'జనసేన'లో చేరిపోయారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే..ముందు ముందు ఈ ఫిరాయింపులు పెరిగిపోతాయని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గ నేతలు ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి నేతల్లో ఉత్కంఠత నెలకొంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వారు తమ సామాజికవర్గం 'జనసేన' వైపు ఆకర్షించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పటికే చాలా మంది జారిపోయారు. 34 నియోజకవర్గాల్లో సగం నియోజకవర్గాల్లో టిడిపి, జనసేనల మధ్య ప్రధాన పోటీ మిగతా నియోజకవర్గాల్లో 'టిడిపి,వైకాపా'ల మధ్య పోటీ జరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కులపరమైన నేతలతో పాటు..యువతతో పాటు ఇతర సామాజికవర్గానికి చెందిన అభిమానులు 'జనసేన' వైపు మొగ్గుచూపుతున్నారని..ఆ తరువాత టిడిపి వైపు ఎక్కువగా కనిపిస్తున్నారని..నిన్నటి వరకు 'జగన్' వైపు మొగ్గుచూపిన కొందరు యువ నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి 'పవన్'కు జై అంటున్నారని పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరుగుతుంది..ఎన్ని నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ జరగనున్నది అనే విషయంపై కిందిస్థాయి నాయకులతో నిత్యం చర్చిస్తూనే ఉన్నారు. కాపు ఓటర్లు స్వల్పంగా ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి నేతల్లో ఉత్కంఠత కనిపించడంలేదని, ఆ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట ఎమ్మెల్యేల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందని ఆ సామాజికవర్గ ఓట్లు తమ పార్టీకి పడవని, మిగతా సామాజికవర్గ ఓటర్లను ఎలా ఆకర్షించాలా..? అనే దానిపై వైకాపా నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి మెజార్టీసీట్లు వస్తే..ఆ పార్టీనే అధికారంలోకి రావడం ఖాయమని సెంటిమెంట్‌తో పాటు నమ్మకం కూడా ఉంది. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి 'చంద్రబాబు' పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి మరో బలమైన నేతను బరిలోకి దింపితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు రాబోయే ఎన్నికల్లో తమ ప్రత్యర్థులు ఎవరు..? వారిపై ఎలా విజయం సాధించాలా..?అనేదానిపై నిత్యం చర్చించుకుంటూ వ్యూహాలు పన్నుతున్నారు. ఈ విషయంలో వైకాపా నేతలు వెనుకబడగా...టిడిపి నేతలు...మాత్రం దూసుకుపోతున్నారు. రెండు జిల్లాల్లోని కాపు, కమ్మ, క్షత్రియ, బీసీ వర్గాల ఓట్లు ఏ పార్టీకి పోలైతే..ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారు..గతంలో వైకాపా అభ్యర్థులు విజయం సాధించిన నియోజకవర్గాల్లో ఒకటీ రెండు చోట్ల మాత్రమే విజయంసాధిస్తారని, మిగతా నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన అభ్యర్థులువిజయం సాధిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఉభయగోదావరి జిల్లాల రాజకీయం రసకందాయకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎవరికి ఎడ్జ్ ఉందనేది చెప్పలేమని..మెజార్టీ నియోజకవర్గాల్లో టిడిపికి మొగ్గు కనిపిస్తోందని ఆరు నియోజకవర్గాల్లో 'జనసేన' మెజార్టీలో ఉందని, వైకాపా ఒకటి లేక రెండు చోట్ల మాత్రమే గెలగలదని వారు అంచనా వేస్తున్నారు.