పర్వతారోహణకు వెళ్లి చిక్కుకున్న 45 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సహా 300 మంది సురక్షితంగా ఉన్నారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వెల్లడించారు. లహుల్-స్పిటి జిల్లాలోని సిస్సు ప్రాంతంలో వారు క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల చిక్కుకుపోయిన ట్రెక్కింగ్ బృందాన్ని సహాయక సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వీరంతా క్షేమంగా ఉన్నారని, శిబిరానికి తరలించిన అధికారులు ఆహారం అందజేసినట్టు సీఎం వెల్లడించారు. మరోవైపు రొహతంగ్ కనుమ వద్ద కురిసి భారీ మంచు కారణంగా రహదారులు మూసుకుపోయాయని, ఈ ప్రాంతంలో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు రెండు హెలికాప్టర్లను పంపాలని ఆర్మీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రొహతంగ్ కనుమ సమీపంలోని ఖోస్కర్ మిలటరీ క్యాంప్ వద్ద 45 మంది విద్యార్థుల ఆచూకి లభించినట్టు ఐఐటీ రూర్కీ ప్రకటించింది. ఐఐటీ విద్యార్థులు, మరో 10 మంది లాహౌల్- స్పితి జిల్లాల్లో పర్వతారోహణకు వెళ్లగా ఈ ప్రాంతంలో మంచు వర్షం కురవడంతో వారి ఆచూకీ తెలియరాలేదు. హంప్తా కనుమను అధిగమించి, ఆపై మనాలీకి రావాలని విద్యార్థులు భావించారని, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో తెలియలేదని ఓ విద్యార్థి తండ్రి రాజీవ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా మంచు దట్టంగా కురవడంతో ఇప్పటివరకూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కులు, కంగ్రా, చంబా జిల్లాల్లో సోమవారం నుంచి మంచు భారీగా కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడంతో వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. వరదల వల్ల కంగ్రా, కుల్లూ, హమీర్పూర్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముంపు ముప్పు పొంచివున్న ప్రాంతాల నుంచి ప్రజలను రక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఆకస్మిక వర్షాలకు వాగులు, నదులు ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. వరదలకు కొన్ని ప్రాంతాల్లో ఇల్లు నెలమట్టమయ్యాయి. ఈ సమయంలో నదులు, కొండచరియలు సమీపంలోకి ప్రజలు వెళ్లరాదని అధికారులు సూచించారు. పారాగ్లైడింగ్‌తోపాటు కొండ ప్రాంతాల్లో నిర్వహించే సాహస క్రీడలను తాత్కాలికంగా నిషేధించినట్టు తెలిపారు.