ఎక్కడ తగ్గాలో…ఎక్కడ నెగ్గాలో భారతీయ జనతా పార్టీకి తెలిసినంత ఎవరికీ తెలియకపోవచ్చు. నిన్న మొన్నటి వరకూ ఆపరేషన్ కమల పేరుతో కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన కమలం పార్టీ విధాన పరిషత్తు ఎన్నికల్లో మాత్రం కొంత వెనక్కు తగ్గింది. అందుకు కారణం బలం లేకపోవడమే. ఎన్నికలు జరిగిన తొలినాళ్లలోనే ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయడం, ఆ తర్వాత బలం లేక స్వచ్ఛందంగా రాజీనామా చేయడం పార్టీని నవ్వుల పాలు చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి విధాన పరిషత్ ఎన్నికల్లో పోటీకి దిగి భంగపడకూడదన్న నిర్ణయం బీజేపీ తీసుకోవడం సరైన నిర్ణయమేనంటున్నారు.కర్ణాటక విధాన పరిషత్తులోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తొలుత బరిలోకి దిగాలని భావించింది. అభ్యర్థులను కూడా దాదాపుగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారేమోనని ఆశగా చూసింది. అది సాధ్యం కాలేదు. అలాగే క్రాస్ ఓటింగ్ కు అవకాశముందని కూడా భావించింది. అయితే కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధిష్టానం నుంచి గట్టి సంకేతాలు రావడంతో బీజేపీ పోటీ చేసి ఓటమి పాలు కావడం ఎందుకని దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు 118 మంది సభ్యుల బలం ఉంది. భారతీయ జనతా పార్టీకి 104 మంది సభ్యులున్నారు. విధాన పరిషత్తు ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికి 112 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఆ బలం బీజేపీకి లేదు. క్రాస్ ఓటింగ్ మీదనే ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న బీజేపీ అది సాధ్యం కాదని భావించి పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో మొత్తం మూడు విధాన పరిషత్ పదవుల్లో రెండు కాంగ్రెస్, ఒకటి జనతాదళ్ (ఎస్)లు పంచుకున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఈ ముగ్గురూ దాదాపుగా ఏకగ్రీవమయినట్లే. విధాన పరిషత్తు ఎన్నికలు, పార్టీలో అసమ్మతిపై చర్చించేందుకు నేడు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయించారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, ఆశలు పెట్టుకున్న వారందరికీ పదవులు రావని, ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. కర్ణాటకలో భవిష్యత్ ఇక కాంగ్రెస్ దేనని, లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించాలని అగ్రనేతలు హితవు పలికినట్లు తెలుస్తోంది. ఎటువంటి అసమ్మతి స్వరాలు విన్పించకుండా ప్రభుత్వాన్ని సజావుగా నడిపించేందుకు సహకరించాలని సిద్ధరామయ్య, వేణుగోపాల్ ఎమ్మెల్యేలను కోరారు. మొత్తం మీద కాంగ్రెస్ లో అసమ్మతి సమసిపోయినట్లేనా? అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గా కొనసాగుతుండటం విశేషం. మంత్రివర్గ విస్తరణ తర్వాత మరింత పెరుగుతుందన్నది వాస్తవం.