ఏ దేశ మేగినా.. ఎందకాలిడినా.. అన్నట్టుగా సీఎం చంద్రబాబు ఎక్కడ ఏవేదిక ఎక్కినా సొంత డబ్బా మానుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఐక్యరాజ్యసమితి నిర్వహించే పర్యావరణ సదస్సులో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, దీనికి ముందు ఆయన అమెరికాలోని తెలుగువారితో మమేకమయ్యారు. ఆయన సొంత డబ్బానే కొట్టుకోవడం విమర్శలు తావిస్తోంది. ఇప్పుడు ట్రంప్ అవలంబిస్తున్న కార్యక్రమాల కారణంగా అమెరికాలో తెలుగు వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిష్కరించి దారి చూపించాల్సిన సీఎం ఎన్నికల ర్యాలీ నిర్వహించడంపై ఎన్నారైలు మండిపడుతున్నారు అమెరికా నుంచే తెలుగు వారంతా ఓటేయవచ్చని తెలిపిన ఆయన అక్కడ కూడా ఏపీ రాజకీయాలపై తన సొంత ధోరణిలోనే ప్రసంగించారు.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటి మీద పెట్టిన శ్రద్ధ వల్లే ఈరోజు ఇంతమంది అమెరికా రాగలిగారని, లేకుంటే భారత దేశంలోనే పడి అడుక్కునేవారనే ధోరణిలో ఆయన వ్యవహరించారు. వందలాది ఇంజనీరింగ్ కళాశాలలు నెలకొల్పడం వల్లే రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రతిభ పెరిగిందని అన్నారు. దూరం అనేది పెద్ద సమస్య కాదని.., సొంత గ్రామానికి ఏం చేయాలో ప్రవాస ఆంధ్రులు ఆలోచించాలని కోరారు. అమెరికాలోని అన్ని నగరాల్లో తెలుగువారు ఉన్నారని… వారంతా అటు వృత్తిలో రాణిస్తూనే.. ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుడటాన్ని ప్రశంసించారు.సమాజ సేవలో ముందున్న ప్రవాసాంధులందరికీ అభినందనలు తెలిపారు. ఇటీవలే అమెరికాలో లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు బ్రహ్మాండంగా నిర్వహించారని.. అదే స్పూర్తిని ఇకపై కూడా కొనసాగించాలని కోరారు. ఏ పార్టీ వల్ల పైకి వచ్చామో ఆ పార్టీకి ప్రచారం చేయడం అందరి బాధ్యతని సీఎం తెలిపారు. ప్రపంచ దేశాలలో పసుపు జెండా రెపరెపలాడుతుందని ఎవరూ ఊహించలేదన్న చంద్రబాబు.. ఇది ఒక రాజకీయ పార్టీకి దక్కిన అపూర్వ గౌరవంగా పేర్కొన్నారు. అయితే, గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అమెరికాలో పర్యటించారు. అయితే, చంద్రబాబు మాదిరిగా డప్పు కొట్టుకోలేదు. అమెరికాలో తెలుగు వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.వీసా వంటి అత్యంత క్లిష్టమైన అంశాల పరిష్కారంపైచర్చకు దారి చూపించారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు మాత్రం అమెరికాలోని తెలుగు వారు పడుతున్న కష్టాలను మాట మాత్రంగానైనా స్పృశించకపోగా.. తనకు ఓటేయాలని అక్కడా ఎన్నికల ప్రచారం చేసేశారు.దీనికి టీడీపీ ఎన్నారై విభాగం ఏం బదులిస్తుందో ? చూడాలి