YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

                                                                          సర్గ-41

                                                గంగను తెచ్చేందుకు తపస్సు చేసిన భగీరథుడు

 "సగరుడి మరణం తర్వాత మంత్రులు-సామంతులు,  ధర్మనిష్ఠుడైన అంశుమంతుడినే రాజు కమ్మని కోరినప్పటికీ, అతడు, తన కొడుకైన మహా బలసంపన్నుడు దిలీపుడిపై రాజ్యభారం మోపి, హిమవత్పర్వతానికి పోయి గంగకొరకు ముప్పైరెండు వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. చివరకు గంగను తేలేక మరణించాడు. తదనంతరం, దిలీపుడు గంగ నెలా తేవాలని-పితృల ఋణం ఎలా తీర్చుకోవాలని-గంగను తెచ్చి సగర పుత్రుల బూడిదరాసులనెలా తడపాలని-ఆ నీళ్లతోనే ఉదకాల నెలా వదలాలని-అదెట్లా సాధ్యపడుతుందని, విచారపడుతూ, అనేక యాగాలుచేసి, ముప్పైవేల ఏళ్లు పరిపాలన చేసి, శోకంతో-వికలమైన మనస్సుతో తుదకు తన కొడుకైన భగీరథుడిని రాజుగా చేసి మరణించాడు. భగీరథుడు రాజర్షిగా వుండి, పిల్లలులేనివాడైనందున, రాజ్యాన్ని మంత్రుల పరంచేసి, గంగను తెచ్చేందుకు గోకర్ణానికి తపస్సు చేసేందుకు పోతాడు. అక్కడ, పంచాగ్నుల (నాలుగు పక్కల మంటలు-పైన సూర్యుడు) మధ్య ఇంద్రియాలను జయించి, చలించని మనస్సుతో, వేయి సంవత్సరాలు చేతులెత్తి-గాలివానలను లక్ష్యంచేయకుండా-నెలకొక్కసారిమాత్రమే కంద మూలాలను తింటూ, గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు, దేవర్షులు తనను సేవిస్తుంటే ఆయన దగ్గరకు వచ్చి, అసమానమైన తపస్సు చాలించి ఆయనకోరికేదో తనకు తెలియచేయమని భగీరథుడితో అంటాడు".
" సౌజన్యమే ధనమనుకునే భగీరథుడు, తనననుగ్రహించి సగరకుమారులందరికి తాను తర్పణాలు వదిలేటట్లు చేయమని, బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. గంగా తీర్థంతో తన తాతల బూడిద రాసులను తడిపితే వారందరు స్వర్గానికి పోతారని-అలా వరమివ్వమనీ, తనకు పుత్రులనిచ్చి ఇక్ష్వాకుల వంశాన్ని నిలబెట్టమనీ బ్రహ్మనడిగాడు భగీరథుడు. ఆయన కోరినట్లే జరుగుతుందనీ, అయితే, ఆకాశగంగ భూమిపై పడితే ఆ వేగాన్ని-భారాన్ని భూమి భరించలేదుకాబట్టి దాన్ని భరించేందుకు శివుడిని ప్రార్థించమని సూచిస్తాడు. భగీరథుడికలా చెప్పి, తన మాట ప్రకారం ఆ పుణ్యచరితుడి కోరిక తీర్చేందుకు భూలోకానికి పొమ్మని గంగకు కూడా చెప్పి అంతర్థానమయ్యాడు ". 
                                                                                      రేపు తరువాయి భాగం..

Related Posts