భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆధార్ గుర్తింపు సంఖ్యపై ఇవాళ సుప్రీకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆధార్‌కు చట్టబద్ధత ఉందని స్పష్టం చేసింది. అయితే, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని పేర్కొంది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ నంబర్‌లు తీసుకునేందుకు ఆధార్కోసం బలవంతం చేయరాదని... స్కూళ్లు, ప్రయివేటు కంపెనీలు ఆధార్‌పై ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూజీసీ, నీట్, సీబీఎస్‌ఈ పరీక్షలకు కూడా12 అంకెల ఆధార్ గుర్తింపు సంఖ్య తప్పనిసరి కాదని ధర్మాసనం పేర్కొంది. అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్ కార్డు మంజూరు చేయరాదని సూచించింది. అయితే పాన్, ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.కాగా ఆధార్ డేటా భద్రతపై అనుమానాలు అవసరంలేదనీ... ఇది పూర్తి సురక్షితమని, విశిష్టమైనదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం ఆధార్ కీలక పాత్ర పోషిస్తోందనీ.. వారికి ఓ గుర్తింపు కల్పిస్తోందని తెలిపింది. ఇతర కార్డుల మాదిరిగా దీన్ని డూప్లికేట్ చేయడం కుదరదని గుర్తుచేసింది. ఇటీవల సంవత్సరాల్లో ఆధార్‌పై విస్తృత చర్చ జరిగిందని... ఆధార్‌కార్డు ఉన్నతమైనది అనేకంటే విశిష్టమైనది అనడం సమంజసంగా ఉంటుందని జస్టిస్ ఏకే సిక్రీ వ్యాఖ్యానించారు. డేటా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పటిష్టమైన డేటా భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆధార్ తప్పనిసరి చేయడం వల్ల రాజ్యాంగ ప్రసాదించిన హక్కులకు భంగం వాటిల్లుతోందనీ.. సొంత ప్రజలపై నిఘా పెట్టినట్టు అవుతోందని పిటిషనర్ వాదించారు. ప్రాథమిక హక్కులైన గోపత్య,వ్యక్తిగత శరీర నిర్మాణ వివరాలు సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఆధార్ కార్డుకు, గుర్తింపునకు తేడా ఉందనీ.. ఒక్కసారి ప్రజల నుంచి బయోమెట్రిక్ డేటా సేకరిస్తే అది సిస్టమ్‌లో స్టోర్ అయి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఆధార్ కార్డు కోసం ప్రభుత్వం కేవలం కొన్ని ప్రాధమికమైన ఆధారాలను మాత్రమే సేకరిస్తుందనీ... ఒకరికి కేటాయించిన ఆధార్ సంఖ్య మరెవరికీ ఉండదని సుప్రీం పేర్కొంది.కాగాఆధార్ సంఖ్యను తప్పనిసరి చేస్తూ కేంద్రం దాదాపు139 నోటిఫికేషన్లు విడుదల చేసింది.2016 లో ఆధార్ చట్టం అమల్లోకి రాకముందే దీనిపై సుప్రీంకోర్టులో సవాళ్లు దాఖలయ్యాయి. మాజీ హైకోర్టు జడ్జి కేఎస్ పుట్టస్వామి సహా 31 మంది ఆధార్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.నాలుగు నెలల్లో దాదాపు38 రోజుల పాటు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మే10న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.