ఏపీలో అధికార టీడీపీ బలంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారతాయో ? ఊహించడం కష్టంగా ఉంది. జగన్ పాదయాత్ర ముందు వరకు జిల్లాల్లో బలంగా ఉన్న టీడీపీ క్రమక్రమంగా బలహీనం అవుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం జనసేన ఊపు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పాలకొల్లు కూడా ఒకటి. ఈ ఏరియాలో యూత్‌లో పవన్‌కు బలమైన అభిమాన గణం కూడా ఉండడంతో తాము గెలుస్తానన్న ధీమాతో జనసేన వర్గాలు ఉన్నాయి. పవన్ సొంత నియోజకవర్గం అయిన నరసాపురంతో పక్కనే ఉన్న భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ చాలా బలంగా ఉన్నట్టు స్థానిక రాజకీయ నివేదికలు కూడా చెబుతున్నాయి. ఏదేమైనా పాలకొల్లు నుంచి చేగొండి సూర్యప్రకాష్ జనసేన అభ్యర్థిగా బరిలో ఉంటే ఇక్కడ హోరాహోరి పోరు ఖాయం. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు జనసేన ధీటైన పోటీ ఇచ్చేలా ఉంది.జగన్ పాదయాత్రలో జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మోచర్ల జోహర్‌వతి, మద్దాల సునీత వైసీపీలోకి జంప్ చేసేశారు. జగన్ పాదయాత్ర జిల్లాలోకి రావడంతో ఆ పార్టీకి ఎక్కడా లేని ఊపు వచ్చింది. ఇదే క్రమంలో జనం ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అవ్వడంతో ఇప్పుడు జనసేన సైతం క్రమక్రమంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బహిరంగంగా ప్రకటించకపోయినా చాలా చోట్ల వారికే పవన్ టిక్కెట్లు ఖరారు చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.తాడేపల్లిగూడెం సీటు మాజీ రాజ్యసభ సభ్యుడు యర్రా నారాయణస్వామి తనయుడు యర్రా నవీన్‌కు ఖరారు అవుతుందని తెలుస్తోంది. పవన్ తాజా జిల్లా పర్యటనలో యర్రా నవీన్ పేరు ముందుగా ప్రకటించనున్నారని జనసేన వర్గాలు కూడా చెపుతున్నాయి. అలాగే పవన్‌కు అభిమానులు, బంధుత్వాలు బలంగా ఉన్న పాలకొల్లు నియోజకవర్గం నుంచి జనసేన తరుపున పోటీ చేసే అభ్యర్థి విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. రాజకీయ దురంధరుడు, మాజీ హోం మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ పాలకొల్లు నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.చేగొండి హరిరామ జోగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సూర్యప్రకాష్ ఎప్పటి నుంచో అసెంబ్లీకి వెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు. ప్రతిసారి ఆయన కలలు తీరడం లేదు. కొద్దు రోజుల కిత్రం జనసేన కండువా కప్పుకున్న సూర్యప్రకాష్‌కు వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు సీటు దక్కనుందని తెలుస్తోంది. పాలకొల్లులో జనసేన అధినేత పవన్ సామాజికవర్గంబలంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్వయంగా పోటీ చేసి ట్రయాంగిల్ ఫైట్‌లో కొన్ని కారణాల వల్ల ఓటమి పాలు అవ్వడం తెలిసిందే. అయితే అప్పట్లో చిరు ఓటమికి అనేక కారణాలు దోహదమయ్యాయి.