ఈసారి నమ్మకమే ముఖ్యం. ఎంతమంది సిఫార్సులు చేసినా సర్వేలతో పాటు పార్టీ పట్ల అంకిత భావంతో ఉండేవారికే టిక్కెట్లు కేటాయిస్తున్నారు జగన్. ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా నమ్మకాన్ని కూడా వారిలో అంచనా వేసి మరీ ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు.గత అనుభవాలను ఆయనను ఈ పరిస్థితికి తీసుకువచ్చాయి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. అందుకు ప్రధాన కారణం బీజేపీ, జనసేన, టీడీపీ కాంబినేషన్ ప్రధాన కారణమన్నది అందరికీ తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాసమస్యలను అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలనుకున్నారు జగన్. చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ తో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారడం జగన్ ను కలచివేసిందంటున్నారు. తాను నమ్మి టిక్కెట్ ఇస్తే కష్టకాలంలో పక్కన ఉండకుండా వెళ్లిపోయారన్న ఆవేదన, ఆగ్రహం జగన్ లో ఇప్పటికీ ఉందంటున్నారు. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి కుటుంబం పార్టీని వీడినప్పుడు ఆయన తీవ్రంగా మధనపడ్డారని సన్నిహితులు చెప్పే మాట. తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేయడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో జగన్ మరింత నొచ్చుకున్నారని, అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని, చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా జగన్ హాజరయ్యే వారని ఆయన చెప్పారు.వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల స్క్రీనింగ్ కూడా అలాగే చేయాలని జగన్ నిర్ణయించారు. ఇటీవల కొందరు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తామని సందేశాలను పంపినా జగన్ నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, కడప, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో ఇమడలేక పోతున్నామని, తిరిగి పార్టీలోకి వస్తామని రాయబారం పంపినా జగన్ స్పందించలేదు. ఒకసారి వెళ్లిన వారిని ఇక చేర్చుకునేది లేదని, అలా చేర్చుకుంటే టీడీపీ, వైసీపీకి తేడా ఏముంటుందని కూడా జగన్ ప్రశ్నించినట్లు చెబుతున్నారు.ఇక నాలుగున్నరేళ్లుగా తననే అంటిపెట్టుకుని ఉన్న ఎమ్మెల్యేలకు జగన్ భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆ నియోజకవర్గాలకు తాను ప్రధమ ప్రాధాన్యత ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. నియోజకవర్గాలపై దృష్టిపెట్టాలని, తాను అవసరమైతే రెండు సార్లు ప్రస్తుతం సిట్టింగ్ ల స్థానాల్లో రెండు సార్లు ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రజలు విశ్వసనీయతకే పట్టం కడతారని, పార్టీని నమ్ముకున్న వారిని ఎన్నటికీ దూరం చేయబోనని జగన్ వారికి మాట ఇచ్చారని, దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాల్లో ఇప్పటి నుంచే విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి టిక్కెట్ రాదన్న ప్రచారానికి జగన్ ఫుల్ స్టాప్ పెట్టారని వైసీపీ వర్గాలు వెల్లడయించాయి.