డీఎంకేలో ఆళగిరి, స్టాలిన్ ల మధ్య వివాదం చల్లారేటట్లు కన్పించడం లేదు. ఆళగిరి ప్రధానంగా కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్ నియోజకవర్గంపై పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి తన సత్తా చాటాలనుకుంటున్నారు. కరుణా నిధి కుటుంబ సభ్యులు సహకారం లేకుండా ఇక్కడ విజయం కష్టమని భావించిన ఆళగిరి తనకు అవకాశమివ్వాలంటూ కరుణానిధి బంధువర్గాన్ని వరుస పెట్టి కలుస్తున్నారు. తిరువారూర్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానని ఆళగిరి నమ్మకంగా చెబుతున్నారు.చెన్నైలో ర్యాలీ తర్వాత ఆళగిరి కొంత శాంతించినట్లే కన్పించారు. కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఆయన ఇంతవరకూ దానిపై నిర్ణయం తీసుకోలేదు. తనను డీఎంకేలోకి తీసుకోవాలని కుటుంబ సభ్యుల నుంచి స్టాలిన్ పై ఆళగిరి వత్తిడి తెస్తూనే ఉన్నారు. వారసత్వం స్టాలిన్ కు ఒక్కరికే కాదని, తనకూ ఉంటుందని కరుణానిధి కుమార్తె సెల్వి ద్వారా రాయబారం ఇంకా నడుపుతూనే ఉన్నారు. తనకు పార్టీలో చోటు కల్పించకుంటే లోక్ సభ ఎన్నికలకు ముందు తానేంటో చూపించాల్సి ఉంటుందని పరోక్ష హెచ్చరికలు కూడా పంపుతున్నారు. స్టాలిన్ మాత్రం ఆళగిరిని పార్టీలో తిరిగి చేర్చుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఆళగిరిని తీసుకుంటే పార్టీ క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళతాయని, కరుణానిధి నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆళగిరి వల్ల పార్టీకి జరిగే నష్టం ఏమీ ఉండబోదని స్టాలిన్ ధీమాగా ఉన్నారు. క్యాడర్ తో పాటు ప్రజలు కూడా కరుణానిధికి అసలైన వారసుడిని తానేనని నమ్ముతున్నారని, అందువల్ల ఆళగిరికి పార్టీలో స్థానం ఉండబోదని ఆయన కుటుంబ సభ్యుల వద్ద కుండబద్దలు కొట్టారు. దీంతో ఆళగిరి భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది డీఎంకేలో చర్చనీయాంశమైంది.ఆళగిరి తొలుత పార్టీ పెట్టాలనుకున్నారు. కానీ చెన్నైలో తాను జరిపిన శాంతి ర్యాలీకి పెద్దగా డీఎంకే శ్రేణుల నుంచి స్పందన కన్పించకపోవడంతో ఆళగిరి వ్యూహం మార్చారు. తిరువారూర్ ఉప ఎన్నికల్లో కరుణానిధి కుమారుడిగా బరిలోకి దిగి తాడో పేడో తేల్చుకోవాలనుకున్నార. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే క్యాడర్ లోనూ, నేతల్లోనూ తనపై నమ్మకం పెరుగుతుందని, తన అవసరం పార్టీకి ఉంటుందని గుర్తించి స్టాలిన్ కూడా దారిలోకి వస్తారని భావిస్తున్నారు. అందుకే ఆళగిరి గత కొద్దిరోజులుగా తిరువారూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు