నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్
తారాగణం: నాగార్జున అక్కినేని, నాని, అకాంక్ష సింగ్, రష్మిక మందన్నా, కునాల్ కపూర్, బాహుబలి ప్రభాకర్, నరేశ్, రావు రమేశ్, వెన్నెలకిషోర్, అవసరాల శ్రీనివాస్, సత్య తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: శ్యామ్‌దత్ సైనూద్దీన్
కళ: సాహి సురేశ్
నిర్మాత: సి.అశ్వినీదత్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ప్రారంభమైంది. ఇలాంటి తరుణంలో నాగార్జున, నాని కాంబినేషన్‌లో రూపొందిన మల్టీస్టారర్ `దేవదాస్`. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ప్రారంభం నుండి సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ పంథాలోనే సాగుతుందని ఎలివేట్ చేస్తూ వచ్చారు. అందుకు తగినట్లే ప్రోమోస్, ట్రైలర్ విడుదల చేశారు. కుర్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సినిమాను తెరకెక్కించడం.. నాగార్జున, నాని నటించడం.. ఇవన్నీ సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలో క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసి మెప్పించిందా? లేదా? అని తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం.
కథ
దేవ (నాగార్జున) పెద్ద డాన్. అతనెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ అందరినీ భయపెడుతుంటాడు. దాస్ (నాని) డాక్టర్. ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తి. తన నిజాయతీ వల్ల ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఇమడలేక బయటికి వచ్చేస్తాడు. అతనికి వాళ్ల ధూల్‌పేటలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా అవకాశం దొరుకుతుంది. అనుకోకుండా పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ దిగిన దేవ, వెతుక్కుంటూ దాస్ ఆసుపత్రికి వస్తాడు. అతని దగ్గర పేషెంట్ అవుతాడు. క్రమంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. అది స్నేహంగా మారుతుంది. పూజ (రష్మిక)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు దాస్. యాంకర్ జాహ్నవి అంటే దేవకి చాలా ఇష్టం. ఇద్దరి ఫ్రెండ్‌షిప్, జీవితాలూ సుఖంగా సాగుతుండగా ఓ ఘటన జరుగుతుంది. దాని వల్ల దాస్.. దేవకి దూరమవుతాడు.. అయితే వారిద్దరినీ కలిపిన అంశాలేంటి? చివరికి దేవకి ఏమయింది? అనేది ఆసక్తికరం.
ప్లస్ పాయింట్లు
- ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలిసిన ఆర్టిస్టులున్నారు
- ప్రతి ఒక్కరూ నేచురల్‌గా నటించారు
- పాటలను తెరకెక్కించిన విధానం బావుంది
- డైలాగులు అక్కడక్కడా బావున్నాయి
మైనస్ పాయింట్లు
- ఫస్టాఫ్‌లో కాస్త ల్యాగ్ ఉన్నట్టనిపించింది
- ఫస్టాఫ్‌లో అన్ని విషయాలను పరిచయం చేయడం వల్ల దేనిమీదా ఫోకస్ పెద్దగా లేనట్టనిపించింది
- ఈగోయిస్ట్ అయిన డాక్టర్‌లో మార్పు రావడానికి పెద్ద కారణాలేం కనిపించవు
- యాంకర్ జాహ్నవి ఇంట్లో డాన్ దేవాకి సంబంధించిన క్లిప్పింగ్స్ ఎందుకుంటాయో తెలియవు
- చిన్న లాజిక్కులు మిస్ అవుతాయి
విశ్లేషణ
దేవాగా నాగార్జునకు ఈ తరహా పాత్రలు కొత్తే అయినా, నటన కొత్త కాదు. కళ్లద్దాలతో, గడ్డం లేకుండా, మీసాలతో గోల్డ్ మెడలిస్టుగా దాస్ పాత్రలో నాని చేసిన నటన బావుంది. నానికి అన్నగా సీనియర్ నరేష్, ఆయన భార్యగా సత్యకృష్ణ, హాస్పిటల్ ఛైర్మన్‌గా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ డాక్టర్‌గా రావు రమేశ్, సైకాలజిస్ట్‌గా వెన్నెల కిశోర్, పోలీస్ ఆఫీసర్‌గా మురళీ శర్మ, ఇన్‌స్పెక్టర్‌గా రష్మిక, యాంకర్‌గా ఆకాంక్ష అందరూ బాగా చేశారు. పాటలను తీసిన విధానం బావుంది. ప్రతి పాటకూ ఓ కాన్సెప్ట్‌ను డిజైన్ చేసి తీశారు. సన్నివేశాలు అక్కడక్కడా బోర్ కొట్టించినా చాలా సన్నివేశాలను కన్విన్సింగ్‌గా తీశారు. ముఖ్యంగా ఉత్తేజ్ హాస్పిటల్ సీన్ కంటతడి పెట్టించింది. అలాగే దేవాకి, దాసుకు మధ్య జరిగే సంభాషణ, నవీన్‌చంద్రను షూట్ చేసేటప్పుడున్న ఛేజ్, చిన్నపిల్లాడు పిస్టల్‌తో ఆటపట్టించే సందర్భం.. అన్నీ బావున్నాయి. దేనికదే సినిమా మొత్తం బావున్నట్టే అనిపించినా, ఎక్కడో సోల్ కాస్త మిస్ అయిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. ఫస్టాఫ్‌లో దర్శకుడు దేవాకి,దాస్‌కీ మధ్య బంధాన్ని చూపించడానికి, లవ్ ఎపిసోడ్స్ చూపించడానికి కాస్త కంగారు పడ్డట్టు అనిపించింది. తెలిసిన విద్యలన్నిటినీ ఒకే సినిమాలో పెట్టేయాలన్న తాపత్రయం కూడా కనిపించింది. ఓ షాట్‌లో సంపూర్ణేష్ బాబు షూటింగ్, ఓ షాట్‌లో ఆర్గాన్ డొనేషన్ అంశాలు, అంతలోనే ఇంకోటి.. ఇంకోటి.. ఇలాదర్శకుడిలో కాస్త కంగారు కనిపించింది. అయినా ఇంతమందిని ఒక తాటిమీదకు తీసుకొచ్చి చేసినందుకు మెచ్చుకోవాల్సిందే. శ్యామ్ కెమెరా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కొన్ని షాట్‌లు నిజంగా మెప్పిస్తాయి.