జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. నేను రౌడీ షీటర్ అని పవన్ చెప్తున్నాడు, నేనేమీ మర్డర్ లు, దోపిడీలు చేయలేదని అన్నారు. ఎవరి మానప్రాణాలకైనా భంగం కలిగించినట్టు తన దృష్టికి వస్తే త్రిసభ్య కమిటీ విచారణకు సిద్ధమని ముఖ్యమంత్రిని కోరినట్టు చెప్పారు. కావాలంటే పవన్ తనకు నచ్చిన వారితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి తనపై వస్తున్న ఆరోపణలు విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోనే నాపై రౌడీ షీట్ పెట్టారు. ఎవరు ఏది రాసిస్తే అది చదవడం రాజకీయం కాదు పవన్ అని అన్నారు. దమ్ముంటే నాపై పోటీచేసి, గెలిచి, నన్ను రాజ్యాంగేతర శక్తిగా నిరూపించాలని అన్నారు. అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని అన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా పవన్ తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు చింతమనేని. పవన్ ఒకవైపు వాదనలు విని ఆరోపణలు చేయడం సబబు కాదని.. రెండు పక్షాల వాదనలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. అయనకు విప్ కు ఛీఫ్ విప్ కు తేదా తెలియదని అన్నారు. నాపై వున్నావి మూడు కేసులే. 37 కేసులున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పవన్ చేసిన అర్థం లేని విమర్శలతో తన జీవితంలో తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇస్తున్నానని అన్నారు.