తమిళనాడులోని డీఎంకే పార్టీ అధినేత, ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురికావడంతో స్టాలిన్‌ను అర్ధరాత్రి హుటాహుటిన అల్వార్‌పేట్ ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలం నుంచి ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. స్టాలిన్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వర్గాలు పత్రికా ప్రకటన విడుదల చేశాయి. గురువారం స్టాలిన్ కుడి తొడకు మైనర్ సర్జరీ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. స్టాలిన్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని స్టాలిన్‌కు వైద్యులు సూచించారు. డీఎంకే ప్రధాన కార్యదర్శి టీఆర్ బాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘స్టాలిన్ బుధవారం రాత్రి అస్వస్థతకు లోనుకావడంతో అపోల్ అసుపత్రికి తరలించాం. గత రెండు నెలలుగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోలేదు. దీంతో కుడి తోడ ఇబ్బంది పెట్టడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు చెప్పారని’ వివరించారు.