33ఏళ్ల క్రితం వివాహేతర సంబంధాల చట్టమైన సెక్షన్ 497 ను కాలం చెల్లిన చట్టంగా పరిగణిస్తూ గురువారం సుప్రీం కోర్ట్ ఇచ్చిన సంచలన తీర్పు ఫై నేడు దేశవ్యాప్తంగా చర్చ నీయంశమైంది.ముప్పై మూడేళ్ల క్రితం తండ్రి సమర్థించిన ఓ చట్టాన్ని ఈరోజు కొడుకు ఖండించారు. వాళ్లే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఆయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్. వివాహేతర సంబంధం క్రిమినల్ నేరం కాదని నేడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. తీర్పు వెలువరించిన ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. అయితే 33ఏళ్ల క్రితం వివాహేతర సంబంధాల చట్టమైన సెక్షన్ 497పై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా తీర్పు చెప్పారు. వివాహేతర సంబంధాల్లో కొంత వరకైనా చట్ట ప్రకారం శిక్షలు ఉండటం సమాజానికి అవసరమని తెలిపారు. ఆయన చట్టం రాజ్యాంగ బద్ధతను సమర్థించారు.నేడు డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం సెక్షన్ 497 పురాతన చట్టమని, ఏకపక్షంగా ఉందని, మహిళల పట్ల అసమానంగా ఉందని తేల్చి చెప్పింది. మహిళల పట్ల అసమానంగా ఉన్న ఏ చట్టమూ రాజ్యాంగ బద్ధం కాదని స్పష్టచేసింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని, వివాహమైతే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని పేర్కొంది. అయితే వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చు. కానీ, కేసులు నమోదు చేయడానికి వీల్లేదని చెప్పింది. అయితే డీవై చంద్రచూడ్ తన తండ్రి అభిప్రాయాన్ని ఖండించడం ఇది రెండో సారి. గతంలో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కేసులో కూడా ఇలాగే జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో సీనియర్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.