భౌగోళికంగా శబరి అంటే గోదావరికి ఉపనది. గోవును బతికించిన గోదా నదిలో శబరి చేరికతో గోదాశబరి అయిందని వాడుక. ఆధ్యాత్మికంగా మాత్రం శబరి అంటే మనకు అనన్య సామాన్య శ్రీరామ భక్తురాలిగా సుపరిచితం.
శ్రీరామచంద్రునికి విందునందించిన పరమ భక్తురాలు శబరి. పరంధామునికి అందించే విందులో మాధుర్యం కొరవడుతుందేమో అనే అపచార భయంచేత శబరి ఎంగిలిపళ్లను శ్రీరామునికి అందించిందని గాధ. దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏ జాతి పండు ఎలా ఉంటుందో, ఏ చెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగలదు శబరి. అందుకనే మంచిపండ్లను పరీక్షించి రాముని కందించింది శబరి. కానీ ఎంగిలి చేసినట్లు వాల్మీకి రామాయణంలో లేదంటారు కొందరు.
శబరి వాగులోకి పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నది నీటిచే స్పృశించబడుతున్నాయి. ఆ పళ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరి ఎంగిలి చేసిన పళ్లను రాముడు తిన్నాడని జానపదులు కథలుగా పాడుకుంటున్నారు.
కంబ రామాయణ కర్త శబరి పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు. శబరి మతంగమహర్షి శిష్యురాలు. సిద్ధయోగిని.శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే రాముని కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిన రామ భక్తురాలు. ఎదురు చూస్తూనే వృద్ధురాలై పోయింది. రామచంద్రుడు వచ్చాడు. కుశల ప్రశ్నల అనంతరం అర్ఘ్య పాద్య ఆచమనీయాలు సమర్పించి, ఆయన కోసం ఎంతో కాలం నుంచి సేకరిస్తున్న పండ్లు ఫలాలను అందించింది. రాముని అనుజ్ఞతో యోగాగ్నిలో ప్రవేశించి, మహా యోగులు పొందే సాయుజ్యాన్ని పొందింది.