తిరుపతి నగరంలో 30 మెట్రిక్ టన్నులకు పైగా వినియోగిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల వలన ప్రజా జీవనం అస్తవ్యస్తం అవుతున్న నేపథ్యంలో అధికారులు నిషేధానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలను చైతన్యపరచడంలో నగరపాలిక అధికారులు విజయవంతమయ్యారు. అవగాహన సదస్సులు, ర్యాలీల ద్వారా అక్టోబర్ 2 నుంచి తిరుపతిలో ప్లాస్టిక్ అమలు నిషేధం అమలు చేయనున్నట్లు ప్రజలకు వివరించారు. మొదటి దశలో జులై నెలాఖరు వరకు నగరంలో ప్లాస్టిక్ వ్యాపారులు, పంపిణీదారుల గుర్తింపు, ప్రత్యామ్నాయాలపై చర్యలు చేపట్టారు. నగరంలోని రెండున్నర వేల మంది వ్యాపారులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ హోల్‌సేల్ విక్రయదారులను రప్పించి వారికి ప్లాస్టిక్ నిషేధం వివరించి ప్రత్యామ్నాయ వ్యాపారాలపై దృష్టి మళ్లించారు. నగరంలో ఉన్న 450 పెద్ద హోటళ్ల నిర్వాహకులకు, వెయ్యికి పైగా ఉన్న చిన్న హోటళ్లకు సమాచారం చేరవేసి వారితో సమావేశమై చైతన్యపరిచారు. నగరంలో విస్తరించిన 220 మాంస విక్రయ దుకాణాల వారికి, 600 వస్త్ర దుకాణాలను సమాచారం అందించారు. ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన రెండో దశ కార్యాచరణలో నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలపై ప్రచార, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఆగస్టు 21 నుంచి నుంచి మూడోదశలో డివిజన్‌ల వారీగా ప్రత్యేకాధికారులను ఏర్పాటు చేసి వారి ద్వారా ఇంటింటికీ ప్లాస్టిక్ నిషేధం అమలుపై విస్తృత ప్రచారం కల్పించారు.ప్లాస్టిక్ నిషేధం అమలుకు అధికారులు ప్రత్యేక స్థానిక చట్టాన్ని రూపొందిస్తున్నారు. చట్టం నమూనాను సిద్ధం చేసి నగరపాలిక ప్రత్యేకాధికారి, జిల్లా పాలనాధికారి అయిన ప్రద్యుమ్న అనుమతి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. చట్టంలో ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలు, అనుమతించే వస్తువులు, అనుమతించని వస్తువులు, అపరాధ రుసుములు, అమలు బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారులు, వారికి కల్పించిన అధికారాలు ఇందులో పొందుపరిచారు. చట్టంలో ఎప్పటికప్పుడు అవసరమైన సవరణలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దశల వారీగా నగరంలో వాడితే జరిమాన కట్టాల్సిందే నగరపాలిక అధికారులు ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. జరిమానాల రూపంలో ప్లాస్టిక్‌ను దూరం చేయడం తప్ప మరో అవకాశం లేకపోవడంతో అధికారులు పెద్ద ఎత్తున విధించనున్నారు. ఉత్పత్తిదారులై తొలిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారి రూ.15 వేలు, మూడో సారి రూ.25 వేల అపరాధ రుసుం, అనుమతి రద్దు, దుకాణం సీజ్ చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. హోల్‌సేల్, రిËటైల్ వ్యాపారులు, సూపర్‌మార్కెట్, హోటల్, వీధి వ్యాపారులు, ఇతర అన్ని రకాల దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లు, నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయించినా.. వినియోగించినా తొలిసారి రూ.వెయ్యి, రెండో సారి రూ.5 వేలు, మూడో సారి పదివేల జరిమానా, అనుమతి రద్దు, దుకాణం సీజ్ చేయనున్నారు. వినియోగదారులు ప్లాస్టిక్ నిషేధిత వస్తువులు కలిగి ఉంటే తొలిసారి రూ.వంద, రెండోసారి రూ.500, మూడోసారి రూ.వెయ్యి జరిమానాతో పాటు వారికి ఇంటికి కార్పొరేషన్ నుంచే అందే సేవలు నిలిపివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు రెండు మూడు రోజుల్లో కార్యాచరణ తుది రూపం రానుంది.