వైసీపీ అధినేత జగన్ ఈసారి ఎక్కువగా యువకులే టిక్కెట్లు ఇస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. జగన్ నుంచి వచ్చే సంకేతాలు కూడా అలాగే ఉండటంతో సీనియర్లను పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకుని, ఎక్కువ మంది టిక్కెట్లు యువతకే ఇవ్వాలన్నది ఆయన ప్లాన్ గా ఉంది. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే వడపోత పోసిన ప్రశాంత్ కిషోర్ టీం కూడా యువనేతల పేర్లనే ఎక్కువగా చెబుతుండటంతో జగన్ ఆలోచనకు కూడా ఇది కలసి వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ఒక కొలిక్కి రావడంతో కొన్ని చోట్ల రీ సర్వే చేయించాలని జగన్ ఆదేశించనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు యువకులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఇప్పుడు వైసీపీలో కొత్త ట్విస్ట్.వై.ఎస్.జగన్మహన్ రెడ్డి కూడా యువకుడే కావడంతో ఆయన ఆలోచనలకు అనుగుణంగా నడిచే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గం నుంచి శిల్పా చక్రపాణి కుమారుడు శిల్పా రవికి జగన్ టిక్ పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గంగుల విజయేంద్రదరెడ్డిని అలియాస్ నాని విషయంలో సర్వేలో కొంత తేడా కన్పించడంతో మళ్లీ సర్వే చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. నంద్యాలలో మాత్రం శిల్పా రవికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయంటున్నారు.గత ఎన్నికల్లో సీనియర్లు అనుకున్న వారే తనను వదిలేసి వెళ్లిపోయారన్న భావనలో జగన్ ఉన్నారు. ఆదినారాయణరెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, సుజయ కృష్ణరంగారావు, భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, జలీల్ ఖాన్, డేవిడ్ రాజు, పోతుల రామారావు వంటి వారు పార్టీని విడిచి వెళ్లారు. అంతేకాకుండా మైసూరారెడ్డి, సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, ఎంపీ ఎస్పీవై రెడ్డిలు తన మైండ్ సెట్ కు సరిపడలేదన్న భావనలో ఆయన ఉన్నారంటున్నారు. యువకులైతే ఎటువంటి ప్రలోభాలకు లొంగరన్నది జగన్ భావనగా తెలుస్తోంది. పార్టీని నమ్మితే వారు అంటిపెట్టుకునే ఉంటారన్న అభిప్రాయంలో జగన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కువగా యువకులను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.గడప, గడపకూ వైసీపీ, జగన్ పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా కూడా ఎక్కువగా అనేక నియోజకవర్గాల్లో యువనేతలే ఎక్కువగా కార్యక్రమాలను చేపట్టారన్న నివేదికలు కూడా జగన్ కు అందాయి. అయితే కొందరు సీనియర్ల విషయంలో మాత్రం ఎటువంటి ఢోకా ఉండదని, కొన్ని ఎంపిక చేసిన సీట్లలో మాత్రమే యువనేతలను రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు కో-ఆర్డినేటర్లను కూడా జగన్ నియమించింది అందుకేనని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. మొత్తం మీద రీసర్వే, యువకుల ప్రాధాన్యం అనే అంశాలు వైసీపీలో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మరి ఎన్నికల నాటికి అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందో చూడాలి.