దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. కేరళలోని శబరిమల ఆయ్యప్ప స్వామి ఆలయంలోనికి మహిళలు వెళ్లవచ్చని తీర్పు నిచ్చింది. కేసుపై వ్యాఖ్యానిస్తూ పురుషులతో పోలిస్తే మహిళలు ఎంత మాత్రం తక్కువ కాదని తేల్చి చెప్పింది. శబరిమల ఆలయంలోనికి మహిళా భక్తులను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారించిన సుప్రీం ఈ మేరకు ఈ రోజు తీర్పు ఇచ్చింది. మహిళల భక్తికి అయ్యప్పను దూరం చేయరాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. శబరిమల ఆలయంలోకి
మహిళల ప్రవేశంపై తీర్పును దీపక్ మిశ్రా చదువుతూ పలు వ్యాఖ్యలు చేశారు. చట్టాలు, సమాజం అందరినీ గౌరవించాలని ఆయన అన్నారు. రుతుస్రావం సాకుగా చూపి, మహిళలను దేవుడికి దూరం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. భారత రాజ్యాంగంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయన్న విషయాన్ని మరువరాదని, అయితే, భక్తుల మనోభావాల కోణం నుంచి కూడా కేసును పరిశీలించామని, అయితే, భగవంతుడు ఎక్కడున్నా ఒకటే అని చెప్పుకుంటున్న వేళ, మిగతా అయ్యప్ప దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై లేని ఆంక్షలు, శబరిమలలో ఉండరాదని పేర్కొంది. దేవళలను పూజించే హిందూ ధర్మంలో విచక్షణకు తావులేదని పేర్కోంది.
శబరి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు ప్రవేశం లేదు. దీన్ని సవాలు చేస్తూ యంగ్ లాయర్స్ అసోసియేషన్తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయ్యప్పస్వామి బ్రహ్మచారి అని అందుకే రుతుక్రమం వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు గతంలో సమాధానమిచ్చారు. ఈ ఆచారాన్ని కొనసాగించాలని ట్రావెన్ కోర్ సంస్థానం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తే తమకు అభ్యంతరం లేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వీటిపై ఆగస్టు 1 నుంచి 8 రోజులపాటు ఇరు వర్గాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పును శుక్రవారం ప్రకటించింది. జస్టీస్ మిశ్రా వచ్చె నెల రెండవ తేదిన పదవీ విరమణ చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై శబరిమల ప్రధాన ఆర్చకుడు కండారు రాజీవరు వ్యాఖ్యానించారు. ఒకవైపు అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆలయం లోకి మహిళల ప్రవేశంపై తీర్పును అమలు చేస్తామన్నారు.