తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ముందస్తు ఎన్నికలను సవాల్ చేస్తూ సిద్దిపేటకు చెందిన శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. తెలంగాణలో ముందస్తు వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని.. ఓటర్ల జాబితాలో కూడా అవకతవకలు సరిదిద్దకుండా ఎన్నికలకు వెళితే ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.ముందస్తు ఎన్నికల కారణంగా తెలంగాణలో 2018, జనవరి1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో సుమారు 20లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోయే ప్రమాదముందని శశాంక్‌రెడ్డి సుప్రీంకోర్టుకు వివరించారు. ఎన్నికలు సరైన సమయంలో జరిగితే 2019, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు సైతం ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉండేదని.. ముందస్తు వల్ల వారంతా ఓటేసే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు. దీనికి తోడు హడావుడిగా ఎన్నికలు జరిగితే పారదర్శకత లోపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూనే.. సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. దీనిపై వారం రోజుల్లోగా ఇరు వర్గాలు సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాతే ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.