స్టాక్ మార్కెట్లు వరసగా నష్టాల బాటలోనే ముగిశాయి. వారాంతానికి చేరుకుంటున్న దశలో బేర్‌మన్నాయి. సెన్సెక్స్ 218 పాయింట్లు కోల్పోయి 36,324 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో 10,977 వద్ద ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోవడంతో దలాల్ స్ట్రీట్ నిరాశజనకంగా మారింది. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు భారీ నష్టాలను చవిచూడటం గమనార్హం. అయితే.. ఐటీ, ఫార్మా మాత్రం పర్వాలేదనిపించడం కాస్త ఊరట.విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్కెట్ సూచీలపై ప్రభావం చూపింది. ఏసీ, రిఫ్రిజిరేటర్లు తదితర 19 వస్తువులపై ప్రస్తుతం ఉన్న 10 శాతం సుంకాన్ని 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. కాసేపటికే ఒడిదొడుకులకు గురయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, పవర్‌గ్రిడ్ గెయిల్, కోల్ ఇండియా స్వల్పంగా లాభపడగా.. యెస్ బ్యాంకు, ఇండియాబుల్స్ ఫైనాన్స్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, యాక్సిస్, ఓఎన్‌జీసీ భారీగా నష్టపోయాయి