తమిళులకు ముఖ్యమైన పెరటాశి నెల సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, వేగంగా, నాణ్యతతో సేవలందించాలని టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం టిటిడి ఛైర్మన్, అధికారులతో కలిసి తిరుమలలోని నారాయణగిరి ఉద్యాణవనంలోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు, విక్యూసి-2లోని అన్నప్రసాదాల తయారీ కేంద్రం, వృద్దులు, దివ్యాంగుల నూతన షెడ్డును, సిఆర్వో, తాగునీరు మరియు ఆహార పదార్థల నాణ్యత పరిశోదన కేంద్రం, పరకామణి సేవకుల వసతి భవనాన్ని, ప్రధాన కళ్యాణకట్టను తణిఖీ చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ పెరటాశి నెల, దసర సెలవులు, శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులు శని, ఆది వారాలలో వేలాదిగా తరలివస్తున్నారని, వీరికి శ్రీవారి దర్శనం దాదాపు 20 గంటల సమయం పడుతుందని వివరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది వారాలలో విఐపి బ్రేక్ దర్శనాన్ని పరిమిత సంఖ్యలో ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. తద్వారా సామాన్య భక్తులు ఎక్కువమంది శ్రీవారిని దర్శించుకుంటారని తెలియచేశారు. అదేవిధంగా భక్తుల కోరిక మేరకు త్వరలో అలిపిరి నడక మార్గంలోని నామాల గాలి గోపురం, 7వ మైలు వద్ద అన్నప్రసాదాలు అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు ఛైర్మన్ అధికారులతో కలిసి విక్యూసి-2లోని వంటశాలను, అక్కడ నిల్వ వుంచిన ముడిసరుకులు, కూరగాయల నాణ్యతను, మిల్క్ బాయిలర్ను పరిశీలించారు. అనంతరం వయో వృద్దులు, దివ్యాంగుల కొరకు నూతనంగా నిర్మించిన షెడ్డును పరిశీలించి, వారికి టిటిడి అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైన్నైకి చెందిన శ్రీమతి విజయరామన్ వయో వృద్దుల షెడ్డులో ఫోన్ సౌకర్యం కల్పించవలసిందిగా కోరగా, ఛైర్మన్ ఫోన్ ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు