YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

మీనాక్షి ఆలయంలో దుకాణాలు తొలగిస్తాం

మీనాక్షి ఆలయంలో దుకాణాలు తొలగిస్తాం

- మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనానికి ప్రభుత్వం సమాధానం

మీనాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని దుకాణాలు తొలగిస్తామని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనానికి ప్రభుత్వం సమాధానమిచ్చింది. కన్యాకుమారికి చెందిన న్యాయవాది అబుల్‌కలాం ఆజాద్‌సుల్తాన్‌ మదురై ధర్మాసనంలో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో... వారసత్వ సంపదగా ఉన్న మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో గత శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదానికి ఆ ఆలయ ఈవోదే పూర్తి బాధ్యత అని తెలిపారు. ఆలయాల్లో గాలి వెసులుబాటు కోసం ఎత్తైన పైకప్పులను ఆగమ నియమాలు మేరకు నిర్మించారని పేర్కొన్నారు.

వాణిజ్య దృక్పథంతో ఆలయాల్లోని పాత నిర్మాణాలకు మార్పులు చేస్తున్నారని, శీతలీకరణ వసతి, విద్యుత్తు సరఫరా తదితరాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇవే మీనాక్షి అమ్మవారి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం తదితర చోట్ల అగ్ని ప్రమాదం ఏర్పడటానికి కారణాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. సంస్కృతి చిహ్నాలుగా విరాజిల్లుతున్న ఆలయాల్లో ఇలాంటి చర్యలను నివారించడానికి ఆయా దుకాణాలను తొలగించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. న్యాయమూర్తులు జస్టిస్‌ సత్యనారాయణన్‌, జస్టిస్‌ ధారణి సమక్షంలో ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది.

అప్పుడు ప్రభుత్వ తరఫు న్యాయవాది హాజరై... మీనాక్షి అమ్మవారి ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదం గురించి విచారణకు 12 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆలయంలోని దుకాణాలన్నీ ప్రస్తుతం మూతపడ్డాయని చెప్పారు. ప్రాంగణంలోని పువ్వుల దుకాణాలు మినహా మిగిలినవి, కొత్త మండపం ప్రాంతంలోని 300 దుకాణాలను తొలగించడానికి చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. దీంతో పిటిషన్‌ తదుపరి విచారణను న్యాయమూర్తులు 27వ తేదీకి వాయిదా వేశారు.

కలవర పెట్టిన పైకప్పు ఘటన....
మదురై మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో పశుపతీశ్వర సన్నిధి పైకప్పు కూలిపోయింది. మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకోగా... వీరవసంతరాయర్‌ మండపం పైకప్పు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశుపతీశ్వర సన్నిధి పైకప్పు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా కూలింది. అగ్నిప్రమాదం ధాటికి ఈ సన్నిధి కూడా దెబ్బతినడంతో ప్రస్తుతం అది కూలినట్టు సమాచారం. జాతీయ భద్రత దళం (ఎన్‌ఎస్జీ) ఎస్పీ రాజేశ్‌కుమార్‌ పాండే నేతృత్వంలో ఆరుగురు సభ్యులు మంగళవారం దిల్లీ నుంచి మదురై చేరుకుని మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయం భద్రత ఏర్పాట్లు పరిశీలించి అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఫొటోలు తీసుకున్నారు. తర్వాత ఆలయ జాయింట్‌ కమిషనరు నటరాజన్‌ను కలిసి భద్రతా ఏర్పాట్లు, అగ్నిప్రమాదం గురించి విచారణ చేశారు.

Related Posts