ఏపీలో రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసుల హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది. అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీ వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న జనసేనలో సైతం వారసులు కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో కొందరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండగా మరి కొందరు ఫ్యూచర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే క్రమంలో వచ్చే ఎన్నికల్లో తమ తండ్రుల తరుపున పోల్ మేనేజ్‌మెంట్ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. వారసుల విషయానికి వస్తే అధికార టీడీపీలో వీరి జాబితా ఎక్కువగానే ఉంది. సీనియర్ పార్లమెంటేరియన్ నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు వచ్చే ఎన్నికల్లో తన తండ్రి తప్పుకుంటే ఆ స్థానంలో ఎంపీ లేదా జిల్లాల్లో ఏదో ఒక చోట నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.రంగారావు కోసం జిల్లాల్లో రెండు అసెంబ్లీ స్థానాలపై కూడా చర్చ నడుస్తుంది. స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తనయుడు కోడెల శివరాం ఇప్పటికే నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తండ్రి తరపున పెత్తనం చక్కపెడుతున్నాడన్నది జిల్లాలో ఓపెన్ టాక్. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని శివరాం పట్టుదలతో ఉన్నాడు. మనకు అందిన సమాచారం ప్రకారం చంద్రబాబు తండ్రి, కొడుకుల్లో ఎవరికో ఒకరే పోటీ చేయాలని… అది కూడా నరసారావుపేట, సత్తెనపల్లిలో ఎదో ఒక సీటునే ఆప్షన్‌గా ఎంచుకోవాలని సూచించినట్టు తెలిసింది. దీనిని బట్టీ కోడెల తప్పుకుని కోడెల కొడుకు కోసం త్యాగం చేస్తారా ? లేదా తిరిగి ఆయనే పోటీ చేస్తారా అన్నది చూడాలి. కోడెల తిరిగి పోటీ చేసిన పెత్తనం మాత్రం శివరాందే అనడంలో సందేహం లేదు.ఇక వియ్యంకులుగా ఉన్న జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ ఎమ్మెల్యే జివి. ఆంజనేయులు తనయుడు హరీశ్‌తో పాటు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బాబు తనయుడు కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఇద్దరూ తండ్రుల తరపున తెర వెనక ఇప్పటికే చక్రం తిప్పుతున్నారు. వీరిలో పెదకూరపాటు ఎమ్మెల్యే తనయుడు సాయి సుధాకర్ ఫ్యూచర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన పేరు జిల్లాల్లో ఓ అసెంబ్లీ సీటు నుంచి వినిపించినా ఇప్పటికే అటు తండ్రి… ఇటు మామ ఎమ్మెల్యేలుగా ఉండడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందా ? అన్నది చెప్పలేని పరిస్థితి.ఇక గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తనయుల్లో పెద్ద కుమారుడు మహేష్‌తో పాటు చిన్న కుమారుడు నిఖిల్ ఇద్దరూ తండ్రి కోసం తమ వంతుగా సాయం చేస్తున్నారు. వీరిలో మహేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వస్తున్నా యరపతినేని సరైన టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ టైమ్‌లో ఆయన తన వారసుడిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని చూస్తున్నారు. ఇక తండ్రి రాజకీయ వారసత్వ అందిపుచ్చుకున్న నిఖిల్ ఇప్పటికే గురజాల, మాచర్ల నియోజకవర్గాలతో పాటు గుంటూరు సిటీలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ దూసుకుపోతున్నారు.విపక్ష వైసీపీ విషయానికి వస్తే బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి ఇప్పటికే గురజాల వైసీపీ సమన్వయకర్తగా వచ్చే ఎన్నికల్లో యరపతినేనిపై పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. కాసు ఫ్యామిలి నుంచి మూడో తరం వారసుడిగా మహేష్ రెడ్డి ఎంట్రీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న జనసేన నుంచి తులసీ సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభుతో పాటు ఆయన వారసుడు పార్టీ తరపున జిల్లాలో కీలకంగా వ్యవహరించనున్నారు. తులసి రామచంద్ర ప్రభు ఫ్యామిలి గుంటూరు సిటీలో వెస్ట్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుందా ? లేదా గుంటూరు లోక్‌సభకు పోటీ చేస్తుందా ? అన్నది వాళ్లే తేల్చుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో మూడు ప్రధాన పార్టీల నుంచి రాజకీయుల వారసుల సందడే ఎక్కువగా కనిపించనుంది.