తమిళనాడు రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. బీజేపీతో అంటకాగుతున్నారని, రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరి పోయిందని అధికార అన్నాడీఎంకే పై డీఎంకే మాటల దాడికి దిగుతోంది. ముఖ్యంగా స్టాలిన్ డీఎంకే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత దూకుడును ప్రదర్శిస్తున్నారు. అధికార అన్నాడీఎంకే చేస్తున్న అవినీతిని ఎండగడుతూనే, మరోవైపు కేంద్రప్రభుత్వం, ప్రదాని నరేంద్ర మోదీపై ఉన్న వ్యతిరేకతను కూడా పళనిస్వామి టీంకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పళనిస్వామి సర్కార్ వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎంకే వ్యాఖ్యలతో కొంత ఇబ్బందిపడుతున్న అధికార అన్నాడీఎంకే ఆ పార్టీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. శ్రీలంకలో తమిళ ఊచకోత విషయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. శ్రీలంకలో నాడు తమిళ ఊచకోతకు కారణం డీఎంకే అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కారణమంటూ విపరీతంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఎల్టీటీఈతో డీఎంకు కు గతంలో ఉన్న సంబంధాలను కూడా బయటకు తెచ్చింది. దీనికి ప్రధాన కారణం తమిళ ఊచకోత అంశాన్ని తెరపైకి తెచ్చి దూకుడు మీద ఉన్న స్టాలిన్ ను డిఫెన్స్ లో పడేయడానికేనన్నది విశ్లేషకుల అంచనా.ఇటీవలే డీఎంకే పార్టీ 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కరుణానిధి మరణం తర్వాత అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన స్టాలిన్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తపన పడుతున్నారు. గత పదేళ్లుగా అధికారంలోకి రాకపోవడంతో క్యాడర్ కూడా కొంత అయోమయంలో ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించకుంటే స్టాలిన్ నాయకత్వంపైనే అనుమానాలు బయలుదేరే అవకాశముంది. స్టాలిన్ ఫెయిల్యూర్ కోసం సోదరుడు ఆళగిరి ఎదురు చూస్తున్నారు. తిరువారూర్, తిరుప్పకుండ్రం ఎన్నికలు కూడా స్టాలిన్ సమర్థతకు సవాల్ గా మారనున్నాయి. దీంతో స్టాలిన్ అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తూ దూకూడు పెంచారంటున్నారు.ఇక పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు కూడా డీఎంకేను, శశికళ కుటుంబాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎంకేను తమిళల ఊచకోత అంశంతో, దినకరన్ పార్టీని జయలలిత మరణం మిస్టరీతో అడ్డుకోవాలని వ్యూహం పన్నుతున్నారు. ఇప్పటికే పళనిస్వామి ప్రతి సభ, సమావేశాల్లో తమిళుల ఊచకోత అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అయితే జయలలిత మరణం విషయాన్ని చెబుతున్నారు. జయలలిత మరణించిన సమయంలో విచారణ కమిషన్ ఎదుట అపోలో ఆసుపత్రి అధికారి సీసీ టీవీలను ను అప్పట్లో అధికారి తీసేయమన్నారని చెప్పడాన్ని పళని, పన్నీర్ లు ఉపయోగించుకుంటున్నారు ఆ అధికారికి ఆదేశాలిచ్చిందెవరని? పరోక్షంగా శశికళ ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా డీఎంకే, అన్నాడీఎంకేలు సెంటిమెంట్ విషయాలను తెరపైకి తెస్తూ లబ్ది పొందాలని చూస్తున్నాయి. మరిఎవరికి ఎంత లాభం? ఎంత నష్టం? అనేది వేచి చూడాలి.