YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నాడు చెత్తకుండీలో చిన్నారి.. నేడు అసిస్టెంట్ కమిషనర్‌ హోదాలో..!!

నాడు చెత్తకుండీలో చిన్నారి.. నేడు అసిస్టెంట్ కమిషనర్‌ హోదాలో..!!

మట్టిలో మాణిక్యం.. ఏ తల్లి కన్న బిడ్డో.. చెత్తకుప్ప పాలైంది.. అదృష్టం బావుండి ఓ నాన్న కాని నాన్న కంట పడింది. అసోంలోని తీన్ సుఖియా జిల్లాకు చెందిన సోబరన్‌‌ బండిమీద కురగాయలు పెట్టుకుని వీధివీధి తిరుగుతూ అమ్ముతుండేవాడు. అదే ఆధారంగా బతుకుతున్నాడు. తల్లి దండ్రులు ఇద్దరూ పెద్దవారు కావడం వారిని చూసుకునే బాధ్యత తనపై పడడంతో పెళ్లి చేసుకోవాలని కూడా ఆలోచించలేకపోయాడు. రోజులానే ఓ రోజు కూరగాయలు అమ్మి చీకటి పడిన తరువాత ఇంటికి వస్తున్నాడు. ఇంతలో ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఓ పసికందు చెత్తకుప్పలో ఏడుస్తూ కనిపించింది. పరుగున వెళ్లి చుట్టూ చూశాడు. పాప తాలూకూ ఎవరూ కనిపించలేదు. ఏజన్మ బంధమో నాకోసమే పుట్టిందేమో అనుకుని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు. అమ్మానాన్నా అన్నీ తానై పెంచి పెద్ద చేశాడు. 25 ఏళ్లు వచ్చిన ఆ అమ్మాయి.. నాన్నా నీ కష్టం ఊరికే పోలేదు.. అసిస్టెంట్ కమిషనర్ అయ్యానంటూ తనకి ఉద్యోగం వచ్చిన ఆర్డర్స్ తండ్రి సోబరన్ చేతిలో పెట్టింది.

చిన్నారి రాకతో తన జీవితం మారిపోయింది. తన జీవితంలో వెలుగులు పంచిన ఆ చిన్నారికి జ్యోతి అని పేరు పెట్టాడు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కోసం తండ్రి పడే తపన, కష్టం అంతా జ్యోతి కోసం పడ్డాడు సోబరన్. మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. బాగా చదవాలంటూ ప్రోత్సహించాడు. జ్యోతి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఓ తండ్రిగా అందమైన కలలు కన్నాడు. కష్టం తెలియకుండా, కన్నీళ్లు రానివ్వకుండా జ్యోతిని పెంచి పెద్ద చేశాడు. ఫలితంగా జ్యోతి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పట్టా తీసుకుంది. అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరైంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్వూలో కూడా విజయం సాధించి ఇన్ కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకుంది. బిడ్డ విజయాన్ని చూసిన తండ్రి సోబరన్ కళ్లలో ఆనంద భాష్పాలు చూసి జ్యోతి తల్లడిల్లిపోయింది. కన్నీళ్లతో తండ్రి పాదాలు తడిపేసింది. వీధిపాలు కావలసిన జీవితాన్ని విద్యావంతురాలిని చేసి ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టిన తండ్రికి మనసులోనే ధన్యవాదాలు తెలిపింది.

Related Posts