రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. అక్టోబర్ 4, 5 తేదీల్లో ఆయన రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. 19వ భారత-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి విచ్చేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులతో అధికారికంగా సమావేశమవుతారు. పుతిన్ పర్యటన వివరాలను భారత విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది. పుతిన్ భారత పర్యటన సందర్భంగా భారత్, రష్యా పలు అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. భారత్ - రష్యా సంబంధాలు, సమకాలీన అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. భారత్ - రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
2000లో పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. నాటి నుంచి భారత్-రష్యా సంబంధాలు వేగం పుంజుకున్నాయి. ఈ సంబంధాలు బాగా బలపడి నూతన అధ్యాయానికి తెరతీయడమే కాకుండా వివిధ రంగాల్లో రష్యా నుంచి మెరుగైన సహకారం లభించింది. గతేడాది జూన్ 1న జరిగిన ఇరుదేశాల వార్షిక ద్వైపాక్షిక సమావేశానికి మోదీ రష్యా వెళ్లిన విషయం తెలిసిందే.