అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వార్తలు జోరందుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని, అందుకు సమయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 2019 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ భారత ప్రభుత్వం ట్రంప్‌కు ఇప్పటికే ఆహ్వానం పంపింది. అయితే.. అమెరికా నుంచి ఈ ఆహ్వానంపై ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం రాలేదు. అయితే.. భారత్‌లో పర్యటించడానికి ట్రంప్ ఆసక్తిగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా, ఇతర దేశాల్లో ట్రంప్ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. వీటిని పరిగణనలోకి తీసుకుని భారత పర్యటన విషయంపై శ్వేతసౌధం నిర్ణయం తీసుకోనుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతున్నాయని, ఇరు దేశాల అధికారుల మధ్య ఇప్పటివరకు 40 సార్లు చర్చలు జరిగాయని అధికారులు తెలిపారు.