అంతర్జాతీయ క్రికెట్లో మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 800 ఔట్లలో పాలుపంచుకున్న తొలి ఆసియా వికెట్ కీపర్‌గా మహీ రికార్డు సృష్టించాడు. ఆసియా కప్ ఫైనల్లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన తుదిపోరులో ధోనీ ఈ మైలురాయిని అందుకున్నాడు. మెరుపు వేగంతో స్టంపౌట్ చేయడంలో తన స్పీడ్ ఏమాత్రం తగ్గలేదని ధోనీ మరోసారి నిరూపించాడు.37ఏళ్ల ధోనీ రెండు అద్భుతమైన స్టంపింగ్స్‌తో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసి అభిమానులను అలరించాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శతకం చేసి జోరుమీదున్న లిటన్ దాస్(121)ను మొదటగా పెవిలియన్ పంపిన ధోనీ.. ఆ తరువాత ప్రమాదకరంగా కనిపించిన బంగ్లా కెప్టెన్ ముష్రాఫీ మొర్తాజా(7)ను పెవిలియన్ పంపాడు. అంతర్జాతీయ క్రికెట్లో(టెస్టులు, వన్డేలు, టీ20లు) అత్యధిక ఔట్లు చేసిన వారిలో ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా ఆటగాడు మార్క్‌బౌచర్ 998, ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిష్ట్ 905 తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఆసియా కప్-2018లో అత్యధికంగా ఔట్లు చేసింది వీళ్లే..!
ఎమ్మెస్ ధోనీ(భారత్)-12
ముష్పికర్ రహీమ్(బంగ్లాదేశ్)-6
లిటన్ దాస్(బంగ్లాదేశ్)-4
ఎస్‌ఎస్ మెక్‌నీ(హాంకాంగ్)-4
మహ్మద్ షెజాద్(అఫ్గనిస్థాన్)-4