అనంతపురం జిల్లా తాడిపత్రి సబ్ డివిజన్ అంటేనే పోలీసులు హడలెత్తే పరిస్థితి. కంటిమీద కునుకు లేనంత ఒత్తిడిలో ఇక్కడి సిబ్బంది విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. జరుగుతున్న వరుస సంఘటనలను పర్యవేక్షి స్తూనే, మరోపక్క శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, అనేక సమస్యలతో ఈ సబ్ డివిజన్‌లోని పోలీసులు మానసిక ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారి కుటుంబం, పిల్లల కోసం కొంచెం సమయం అయినా కేటాయించలేని దీన స్థితి వారిది. జిల్లా స్థాయి అధికారులే ఇక్కడ మకాం వేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారంటే ఈ సబ్‌డివిజ్ ఎంత సమస్యాత్మకమైనదో అర్థమవుతోంది. ఇంత సమస్యాత్మకమైన ఈ డివిజన్‌లో పోలీస్ ఉద్యోగం అంటే కత్తిమీద సాములాంటిదే. తాడిపత్రి సబ్‌డివిజన్ అంటేనే అత్యంత సమస్యాత్మకమైనది. ఏ సంఘటన జరిగిన సంచలనమే. అది రాజకీయ ఘర్షణలైనా, ఫ్యాక్షన్ సంఘటనలైనా ఏవైనా సరే. ఇందులో అత్యంత సమస్యాత్మకమైనవి యల్లనూరు, తాడిపత్రి, తాడిపత్రి రూరల్ మండలాలు. ఇక్కడ జరిగే ప్రతి సంఘటన అత్యంత సున్నితమైనదే. ఈ సంఘటనలన్నీ ఆధిపత్యం కోసం నాయకులు పడుతున్న ఆరాటంలో భాగమేనని చెప్పవచ్చు. ఏదైనా సంఘటనపై జరిగితే పోలీసులు విచారించి, విషయం తెలుసుకునే లోపే రాజకీయ ఒత్తిళ్లు వస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతుంది. యల్లనూరు మండలంలో ప్రతి చిన్న సంఘటన రాజకీయ రంగు పులుముకుంటుంది. ఎవరికి వారు పట్టు సాధించుకునే ప్రయత్నంలో సంఘటనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో మండలంలో జరిగే ప్రతి చిన్న సంఘటన సంచలనం అవుతోంది. గత ఎనిమిది నెల లుగా మండలంలో చిన్న చిన్న సంఘట నలు పెను తుఫానుగా మారాయి. ఇందులో కొడవాండ్లపల్లి పెద్దమ్మతల్లి ఆలయంపై నాయకులు ఆధిపత్యం కోసం ఆరాటపడ టంతో మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెల కొంది. కూచువారిపల్లిలో పొలం తగాదా విషయంలో నాయకులు పైచేయి కోసం ప్రయత్నించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరం ఏర్పడింది. కొన్ని రోజుల పాటు ఆ గ్రామంలో పోలీసు ఉన్నతాదికారులు శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన సద్దుమనగక ముందే వెన్నపూసపల్లిలో చీనీచెట్లపై విష ప్రయోగం జరిగింది. అది మరువకముందే తిమ్మంపల్లిలో చిన్న విషయానికే టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తపై దాడి చేయడం, తదనంతరం గ్రామంలో ఉద్రిక్త వాతావరం నెలకొన డంతో వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఇలా మండలంలో చిన్నచిన్న సంఘటనలకు రాయకీయ రంగు పులుముకుం టుండటంతో పోలీసులు ఉక్కిరి బిక్కిరి అవుతు న్నారు. ఈ వరుస సంఘటనలతో స్టేషన్‌లో ముగ్గురు సిబ్బంది మినహా అందరూ గ్రామా ల్లోనే ఉండాల్సిన పరిస్థి నెలకోంది. దీనికి తోడు ఉన్నతాధికారుల హెచ్చరికలు, రాజకీయనాయకు ల ఒత్తిళ్లతో ఇక్కడి పోలీసు సిబ్బంది తీవ్ర మానసి క క్షోభకు గురవుతున్నారు. ఈ ఒత్తిళ్లు తాళలేక ఇక్కడ పోలీసులు సెలవులపై వెళ్ల్లేందుకు ప్రయత్నిస్తున్న దాఖలాలు లేకపోలేదు. ఇటీవల ఎస్‌ఐ సైతం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నించగా ఉన్నతాధికారుల ఆయనకు సర్దిచెప్పి నట్ల్లు సమాచారం. తాడిపత్రిలో పోలీసు సిబ్బంది పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ ఇద్దరు నాయకుల కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆది నుంచి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం వారిది. దీంతో ఇక్కడ విధలు నిర్వహించాలంటే పోలీసులకు కత్తిమీద సాములాంటిదే అని చెప్పవచ్చు. ప్రతి చిన్న సంఘటనకు నాయకులు జోక్యంతో పాటు తీవ్ర ఒత్తిళ్లు, ధర్నాలు, ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు.. ఇలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇటీవల పట్టణంలో హిమగిరిబారు విషయంలో, మొన్న జరిగిన ప్రబోధానంద ఆశ్రమం సంఘటనలో దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోయింది. ఈ కేసులతో పాటు ఊరుచింతల గ్రామంలో హత్యా సంఘటనలు జరగడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక సంఘటన నుంచి తేరుకోక ముందె మరో సంఘటన జరుగుతుండటంతో పోలీసులకు ఊపిరాడని పిరిస్థితి. ముందస్తు సమాచారాన్ని ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకునే లోపు జరగాల్సింది జరిగిపోతుం టుంది. తదనంతరం సిబ్బందిపైనే చర్యలు తీసుకుంటుండటంతో సమస్యాత్మకమైన గ్రామాలకు విధులు నిర్వహించేందుకు కానిస్టేబుళ్లు ససేమిరా అంటున్నట్లు సమచారం. యల్లనూరు మండలంలో అత్యంత సమస్యాత్మకమైన తిమ్మంపల్లి గ్రామంలో విలేజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేందుకు ఎవరు ఆసక్తి చూపకపోవడంతో ఏడాదిలోనే ముగ్గురు మారారు. తాడిపత్రి, పుట్లూరు మండలాల్లోని సిబ్బంది పరిస్థితి ఇంతే. ఇటీవల ప్రబోధానందా ఆశ్రమం వద్ద జరిగిన దాడులు, ప్రతిదాడుల ఘటనలకు సంబంధించి ముగ్గురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో సీఐ, రూరల్ ఎస్‌ఐతో పాటు ఇన్‌చార్జ్ డీఎస్పీపై వేటు పడింది. దీంతో మిగిలిన సిబ్బంది సైతం ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు. ఇక్కడి పోలీసులకు విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లతో పాటు సంఘటనలు జరిగినప్పుడు వచ్చే పోలీసు బలగాలలకు అయ్యే ఖర్చులు మరో సమస్య అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న సంఘటన జరిగిన శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసు బలగాలు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుంటాయి. దీంతో వారికి అవసరమైన మౌలిక వసతులు, భోజన సౌకర్యం ఏర్పాటు చేయడంలోనే ఇక్కడి సిబ్బంది తలమునకలవుతున్నారని, దీంతో ఆయా స్టేషన్లకు ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని సమాచారం. ప్రతి రోజు వారికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకే కొందరి సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలుస్తోంది.