YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాన్ సిట్టింగ్ స్థానాలపై బాబు గురి

నాన్ సిట్టింగ్ స్థానాలపై  బాబు గురి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వ్యూహం చివరకు ఆయనకే తలనొప్పి తెచ్చేలా కన్పిస్తుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రాబాబు కీలక నియోజకవర్గాలపై దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు లేని చోట తొలుత ఆ యా ప్రాంత నేతలతో చంద్రబాబు సమావేశాలు జరుపుతున్నారు. ఆ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఒకరు ఉన్నా టిక్కెట్ కోసం అనేకమంది పోటీ పడుతున్నారు. ఎవరికి వారే పార్టీ కోసం ఖర్చు కూడా పెట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు తన సర్వేల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని వారిలో మంచి మార్కులొచ్చిన నేతలకే టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అంతవరకూ బాగానే ఉంది.పట్టున్న నేతలు ఇద్దరు ముగ్గురు టిక్కెట్ కోసం పోటీ పడుతుండటంతో చంద్రబాబు మధ్యేమార్గంగా ఒక ఫార్ములాను రూపొందించారు. ఉదాహరణకు చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ టిక్కెట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. మదనపల్లి నుంచి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, రాందాస్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే దమ్మాల పాటి రమేష్ లు టిక్కెట్ తమకంటే తమకేనని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో వీరి ముగ్గురిని పిలిపించుకుని చంద్రబాబు ఒక ప్రపోజల్ పెట్టారు. మీలో ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు? అని. సర్వేలో మంచి ఫలితాలు వచ్చిన వారికే టిక్కెట్ ఇస్తానని, మిగిలిన వారిలో ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పి పంపించేశారు. మదనపల్లి పంచాయతీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు ఇదే రకమైన విధానాన్ని అనుసరిస్తారా? అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇలా పోటీ పడే నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో సయితం మదనపల్లి పంచాయతీనే గతంలో చంద్రబాబు వాడిన సంగతి తెలిసిందే. ఇక గుంటూరు జిల్లాలోని గుంటూరు తూర్పు నియోజకవర్గం, బాపట్ల, మాచర్ల, కృష్ణా జిల్లాలోని గుడివాడ, నూజివీడు, మచిలీపట్నంలో మదనపల్లి తరహాలోనే నేతలు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొండేపి, కందుకూరు, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లాలోని గూడూరు, అనంతపురం జిల్లాలోని కదిరి, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాలు, కర్నూలు సిటీ నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి టౌన్ నియోజకవర్గాల్లో ఇదే తరహా పోటీ ఉంది. ఇప్పుడు వీరందరిలో ఒక్కరికి టిక్కెట్ ఇచ్చినా మిగిలిన అందరికీ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశమే లేదు. వీరిలో కొందరికే ఆ ఛాన్స్ దక్కుతుంది. అందుకోసమే తమను చంద్రబాబు ఎప్పుడు పిలుస్తారోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. టిక్కెట్ కాకున్నా ఎమ్మెల్సీ అయినా దక్కితే చాలని కొందరనుకుంటంటే….టిక్కెట్ కావాల్సిందేనని మరికొందరు గట్టిగా పట్టుబడుతున్నారు. మొత్తం మీద మదనపల్లి పంచాయతీ చంద్రబాబు మెడకు చుట్టుకునే టట్లే కన్పిస్తుంది.

Related Posts