కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకలుతీరిన రాజకీయ యోధుడు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడు దేవినేని అవినాష్ జట్ రాకెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. చట్ట సభలకు ఎంపిక అవ్వడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అవినాష్ రాష్ట్ర స్థాయిలో తెలుగు యువతను పరుగులు పెట్టించడంతో పాటు విజయవాడ నగర రాజకీయాలు కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లోనే అవినాష్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి 50వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఆ తర్వాత తన తండ్రితో పాటు టీడీపీలోకి జంప్ చేసిన అవినాష్‌కు మంచి రాజకీయ భవిష్యత్తే ఉంటుందని అందరూ అంచనా వేశారు. తండ్రి నెహ్రూ అకస్మిక మృతితో ఇప్పుడు అవినాష్ రాజకీయంగా ఎదిగేందుకు ఒంటరి పోరే చెయ్యాల్సి వస్తోంది.ఇక పార్టీకి కొద్ది సంవత్సరాలుగా సరైన క్యాండెట్ లేక పార్టీ సతమతమవుతోన్న పశ్చిమ కృష్ణాలోని నూజివీడు సీటు నుంచి కూడా అవినాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే వాస్తవంగా అవినాష్ మదిలో విజయవాడ సిటీలో ఓ సీటు లేదా నగర సమీపానికి ఆనుకుని ఉన్న రెండు సీట్ల మీదే ఉన్నట్టు తెలుస్తోంది. ఓ సీనియర్ ఎమ్మెల్యేను విజయవాడ ఎంపీ బరిలోకి దింపుతారన్న ప్రచారంతో ఆ సీటు నుంచి ఫస్ట్ ఆప్షన్‌గా అవినాష్ పేరే పరిశీలనలో ఉండడం అవినాష్‌కు కలిసిరానుంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో దేవినేని వారసుడి పొలిటికల్ ఎంట్రీ… పోటీ ఖరారు కావడంతో ఆయనకు అధిష్టానం ఏ సీటు ఇస్తుంది అన్నదే సస్పెన్స్‌గా మారింది.
ఎన్నికల్లో అవినాష్‌కు పార్టీ అధిష్టానం జిల్లాల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇవ్వడం గ్యారెంటీయే అంటున్నారు. అయితే అవినాష్‌కు అనువైన నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థులు ఉండడమే కాస్త ఇబ్బందిగా పరిణమిస్తుంది. గతంలో నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన పాత కంకిపాడు నియోజకవర్గం నుంచి ఏర్పడిన పెనమలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, విజయవాడ తూర్పులో గద్దే రామ్మోహన్, గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరు ముగ్గురు ఆయా నియోజకవర్గాల్లో చాలా బలమైన నేతలుగా ఉన్నారు. వీరిని మార్చడం కష్టమే. అయితే కొన్ని సమీకరణలు మాత్రం ఇక్కడ అవినాష్‌కు కలిసొచ్చేలా ఉన్నాయి.పార్టీ యువనేత లోకేష్ పెనమలూరు నుంచి పోటీ చేయాలనుకుంటే బోడేను ఇక్కడ తప్పించాల్సి రావొచ్చు. ఈ మూడు నియోజకవర్గాల సంగతి ఇలా ఉంటే కొద్ది రోజులుగా అవినాష్ పేరు జిల్లాలోని నూజివీడు, గుడివాడ నుంచి కూడా వినిపిస్తోంది. గుడివాడలో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉండడంతో పాటు… టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని ఢీ కొట్టేందుకు అవినాష్‌ను అక్కడ పోటీలోకి దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా పార్టీ అదిష్టానం మదిలో ఉంది. దేవినేని ఫ్యామిలీకి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అనుచరులు ఉన్నా గుడివాడలో నాని మీద పోటీ అంటే మామూలుగా ఉండదు.