మంగళవారం నుంచి ప్రారంభంకాబోయే ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని విజయవంతం చేయాలని, ఎల్లుండికల్లా ఆయా ఖాతాలలో రూ.1,000 చొప్పున జమ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం నీరు – ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ప్రపంచం మొత్తం మన ప్రకృతి సేద్యం వైపు చూస్తోందని, ప్రకృతి, సాంకేతికత సమర్థ వినియోగమే ఏపీ ఘనత అని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో రాష్ట్రానికి మంచి గుర్తింపు లభించిందన్నారు. అటు ప్రకృతి, ఇటు సాంకేతికత అద్భుతమైన జోడి అని, రెండింటినీ సమర్ధంగా వినియోగించుకోవడమే ఏపీ ఘనతని అని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రకృతి సేద్యం ప్రపంచానికే నమూనా కావాలన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే ముందున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 19% వర్షపాతంలోటు ఉందని, సమర్థ నీటి వినియోగం, జలరక్షణ చర్యలే అన్ని సమస్యలకు పరిష్కారమని అయన అన్నారు. జల సంరక్షణ చర్యలే కరవుకు పరిష్కారమని అధికారులకు సూచించారు. రబీ విత్తనాల పంపిణీపై శ్రద్దపెట్టాలని, ఖరీఫ్ దిగుబడి ముందస్తు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. 15.7 కోట్ల పనిదినాలను పూర్తిచేశామని...రూ.4,893 కోట్ల నిధుల వినియోగం జరిగిందని వెల్లడించారు. ఇంకా ఏడు వేల కోట్ల నిధులను వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. డిసెంబర్ 30 వరకు పశుగణనను విజయవంతం చేయాలని అయన ఆదేశించారు.