అక్టోబరు ఆరంభంలో దేశీయ మార్కెట్లు లాభాలను చవిచూశాయి. సోమవారం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి మంచి లాభాలను గడించాయి. ఉదయం 90 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్; 10,900 పాయింట్ల దిగవన నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభించాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీల నష్టాలకు కారణమైంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, మెటల్ షేర్లలో అమ్మకాల జోరు కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు క్రమంగా లాభాల బాటలో పయనించాయి. నిఫ్టీ కూడా తిరిగి 11 వేల స్థాయిని అందుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 299 పాయింట్లు లాభపడి 36526.14 వద్ద, నిఫ్టీ 77.85 పాయింట్ల లాభంతో 11008.3 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో యస్ బ్యాంక్, హిండాల్కో, టీసీఎస్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ గెయినర్లుగా నిలువగా.. భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌పీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాక్ షేర్లు టాప్ లూజర్లుగా నిలిచాయి.