- మోడీ నోటి వెంట టిడిపి పాట
ఏపీ ఒక్క రాష్ట్రాన్నే కాంగ్రెస్ మోసం చేయలేదని, దేశం మొత్తాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీపై పొగడ్తలు కురిపించారు. కాంగ్రెస్ నేతల అవమానాల నుంచే తెలుగు దేశం పార్టీ పుట్టిందన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవానికి టీడీపీ ప్రతీక అన్నారు. కాంగ్రెస్ వాళ్లు చేస్తున్న అవమానాలు భరించలేకే దివంత ఎన్టీ రామారావు.. తెలుగు దేశం పార్టీని స్థాపించారన్నారు. ఓసారి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హైదరాబాద్ వెళ్లినప్పుడు.. కాంగ్రెస్ నేత అయిన టీ అంజయ్యతో ఆయన ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసన్నారు. ఓ సీనియర్ నేత పట్ల ఆయన ప్రవర్తన తీరు బాగాలేదన్నారు. కేవలం తక్కువ కులం వాడు కావడం వల్లే రాజీవ్ గాంధీ అలా ప్రవర్తించారని గుర్తు చేశారు. అంతేగాకుండా రాష్ట్రపతి కావాల్సిన నీలం సంజీవరెడ్డిని మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రపతి పదవికి నామినేట్ చేసినట్టే చేసి కాంగ్రెస్ వెన్నుపోటు పొడించిందని ఆరోపించారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ తమ సొంత కుటుంబం కోసమే పాకులాడింది తప్ప ఒరగబెట్టిందేమీ లేదన్నారు. స్వప్రయోజనాల కోసం దేశ శ్రేయస్సును తాకట్టుపెట్టిందని విమర్శించారు. విమర్శలు వచ్చిన ప్రతిసారీ.. ‘మేం అధికారంలో ఉన్నప్పుడు...’ అంటూ మాట్లాడేస్తుంటారని, అలానే దేశాన్ని మొత్తం విభజించారని మోదీ మండిపడ్డారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ వల్లే దేశంలో ప్రజాస్వామ్యం వచ్చిందని వాళ్లు ఎలా చెబుతారని, భారత చరిత్ర ఇదేనా అని ప్రశ్నించారు. దేశానికి ఈ బాధేంటి అని అన్నారు.