ఇండోనేషియాలోని సులవెసి ద్వీపంలో సంభవించిన భారీ భూకంపం, సునామీ కారణంగా ద్వీపంలోని మూడు జైళ్లు ధ్వంసమైపోవడంతో దాదాపు 1200 మంది ఖైదీలు తప్పించుకున్నారని ఇండోనేషియా న్యాయ శాఖ మంత్రి సోమవారం వెల్లడించారు. అయితే ఈ బీభత్సం కారణంగా సునామీ సంభవించిన పాలూ నగరంలో జైలు గోడలు కూలిపోవడంతో ఖైదీలు అక్కడి నుంచి పారిపోయినట్లు ఆయన వివరించారు.భారీగా నీరు జైల్లోకి ప్రవేశించడంతో భయాందోళనలకు గురైన ఖైదీలు అక్కడి నుంచి రోడ్లమీదికి పరుగులు తీశారని మంత్రి చెప్పారు. భూకంప భయంతో చాలా మంది ఖైదీలు పారిపోయారని, ఇది ఖైదీల చావుబతుకులకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. మరో చోట ఖైదీలు జైలు ప్రధాన ద్వారం ధ్వంసం చేసి పారిపోయారని, డోంగ్‌గలాలోని జైలులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 343 మంది తప్పించుకున్నారని మంత్రి వివరించారు. సునామీ తమ ప్రాంతంలో బీభత్సం సృష్టించిదన్న విషయం తెలుసుకున్న ఖైదీలు తమ వారిని చూడాలని డిమాండ్ చేశారని, వారు ఆగ్రహంతోనే జైలుకు నిప్పంటించినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.పాలూ నగరంలోని రెండు జైళ్లలో కేవలం వంద మంది మాత్రమే ఖైదీలు ఉన్నట్లు మంత్రి స్పష్టంచేశారు. అయితే సునామీ విలయం కారణంగా భారీ నష్టం జరగడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఖైదీలకు ఆహారం అందించేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందని, అక్కడ ఎక్కువ రోజులు ఆహారం దొరికే పరిస్థితి కూడా లేదని తెలిపారు. పాలూ నగరంలో బీచ్ ఫెస్టివల్‌కు వచ్చిన ఎంతో మంది సముద్రంలో కొట్టుకుపోయారు. అక్కడి వీధులు మృతదేహాలతో నిండిపోయాయి. ప్రాణాలతో ఉన్న వారు ఆహారం, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.