ప్రధాని నరేంద్రమోదీ మాదిరిగా ప్రపంచంలో ఎవరూ ఉండబోరని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌కుమార్ దేబ్ అన్నారు. ప్రధానితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ఎంతో నిరాడంబరంగా ఉంటారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ‘ప్రధానికి తల్లి ఉన్నారు. కానీ ఆమెను తనతో పాటు ప్రధాని అధికారిక నివాసంలో ఉండటం లేదు. మోదీ నాలుగేళ్లుగా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.. 13ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన సోదరుల్లో ఒకరు కిరాణా షాపు నడుపుకుంటుండగా, మరొకరు ఆటో డ్రైవర్‌గా ఉన్నారు. ఆయన తల్లి ఓ చిన్న ఇంట్లోనే నివాసం ఉంటుంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఇలా ఉంటున్న ప్రధాని ఎవరైనా ఉన్నారేమో చెప్పండంటూ ప్రజలను ఆయన ప్రశ్నించారు. అగర్తలాలో నిర్వహించిన పరాక్రమ్ పర్వ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ నిరాడంబరతను మెచ్చుకున్నారు.ఛాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించి ప్రధానమంత్రిగా ఎదిగిన నరేంద్రమోదీ ఆస్తులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. వీటి ప్రకారం మార్చి 31, 2018 నాటికి ప్రధాని మోదీ చేతిలో ఉన్న నగదు రూ.48,944. ఆయన ఆస్తుల మొత్తం విలువ రూ.2.28కోట్లు. ఇందులో 1.28కోట్లు చరాస్థులు కాగా.. గాంధీనగర్‌లోని మోదీ నివాస స్థలం విలువ కోటి. ఆయనకు సొంత కారు కూడా లేదు.