YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరం... అనుకున్నంత వీజీ కాదు కుండబద్దలు కొట్టిన సీడబ్ల్యూసీ

Highlights

 

 పోలవరం... అనుకున్నంత వీజీ కాదు కుండబద్దలు కొట్టిన సీడబ్ల్యూసీ

పోలవరం… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖంగా అందరినోటా వినపడుతున్న మాట. ఎప్పుడో ఎనిమిదో దశకంలో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు దశాబ్దాల తరబడి ఫైళ్లకే పరిమితమయింది. మళ్లీ రెండు దశాబ్దాల అనంతరం కాంగ్రెస్ మరో ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పనులకు మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టుకు పునాదులు వేసిన,పని మొదలు పెట్టిన ఇద్దరు ముఖ్యమంత్రులు కోస్తా ప్రాంతానికి చెందిన వారు కాకపోవడం గమనార్హం. పునాది వేసిన అంజయ్య తెలంగాణ బిడ్డకాగా, పనుల్లో కదలిక తెచ్చిన మరో ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాయలసీమ వాసి. ప్రస్తుతం పనులను పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా రాయలసీమ బిడ్డే. అంటే కోస్తా ప్రాంతానికి కొంగుబంగారంగా నిలిాచే ఈ ప్రాజెక్టు పట్ల శ్రద్ధ వహించింది కోస్తా ప్రాంతయేతర ముఖ్యమంత్రులే కావడం విశేషం. కోస్తా ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రుల హయాంలో ప్రాజెక్టు పనులు అడుగు కూడా ముందుకు పడలేదన్నది చేదునిజం.పశ్చిమ గోదావరి జిల్లా రామాలం పేట గ్రామం వద్ద రాజమండ్రి-కోవూరుల నుంచి 34 కిలోమీటర్ల దూరంలో, ధవళేశ్వరం ఆనకట్టకు 42 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,716 కోట్లు. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. 2014 నాటి ఏపీ విభజన చట్టంలో దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో కేంద్రం సాయం అందజేస్తోంది. ఎడమకాల్వ పొడవు 181.50కిలో మీటర్లు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చు. విశాఖ నగర తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. జల రవాణాకూ ఉపయోగపడుతుంది. కుడికాల్వ పొడవు 174 కిలోమీటర్లు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా జిల్లాల్లో దీని ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తారు. అంతేకాకుండా 80 టీఎంసీల గోదావరి జలాలనను కృష్ణా బేసిన్ కు తరలించనున్నారు. 960 మెగా వాట్ల జల విద్యుత్తును ఉత్పత్తిచేసే అవకాశముంది. ఎవరెన్ని చెప్పినా రాజశేఖర్ రెడ్డి హయాంలోనే దీనికి కదలిక వచ్చిందన్నది వాస్తవం. పోలవరం ప్రతి అడుగులో వైఎస్ పాత్ర ఉందన్న విషయాన్ని ఆయన వ్యతిరేకులు అయినా అంగీకరించక తప్పని పరిస్థితి. కుడికాల్వ ఆయన హయాంలోనే దాదాపు పూర్తయింది. ఇప్పుడు దాని ద్వారానే గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారు. ఫలితంగా కృష్ణా డెల్టాకు సాగునీటి కొరత గండం తప్పినట్లయింది.ప్రాజెక్టు నేపథ్యం, పూర్వాపరాలను పరిశీలించిన ప్రతి ఒక్కరికీ ఆసక్తి కలగడం సహజం. ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుందని ఆశించడం సహజం. కానీ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుచూస్తే గుండె తరక్క మానదు. పనుల కన్నా కాంట్రాక్టరుకు కోట్ల రూపాయల మేర లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం ఆవేదన కలిగిస్తోంది. రూ.1,853.06 కోట్ల మేరకు కాంట్రాక్టరుకు అనుచిత లబ్ది కలిగించేందుకు ప్రభుత్వం అడ్డగోలుగా నిబంధనలను సడలించింది. ఇది విపక్షాల ఆరోపణో? లేక పత్రికా కథనమో కాదు. రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించిన చేదునిజం. ఈ నివేదికను ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి స్వయంగా వెల్లడించిన వాస్తవం. కాగ్ వెల్లడించిన వివరాలను చూస్తే కళ్లు తిరగక మానదు. ఇంత లబ్డి కలిగించినా నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశం లేదని కాగ్ స్పష్టం చేసింది. 2012 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకకూ జరిగిన పనులపై కాగా్ నివేదిక సమర్పించింది.

వాస్తవానికి ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాల్లో ప్రభుత్వ తీరును కాగ్ ఎండగట్టింది. నివేదిక సిద్ధం, సవరించిన అంచనాలు, కేంద్రానికి బిల్లులు సమర్పించడంలో జరిగిన జాప్యం వల్ల నిధులను సకాలంలో పొందలేకపోయారని తప్పు పట్టింది. అసమగ్ర ప్రణాళిక, ఆకృతుల ఖరారులో జాప్యం, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో జాప్యం వల్ల పనుల్లో మందకొడితనం నెలకొందని ఎత్తిచూపింది. నిర్మాణంలో అటవీ, పర్యావరణ నిబంధనలను సక్రమంగా అమలు కావడం లేదని, కుడి, ఎడమ కాల్వల్లో 15వ ప్యాకేజీకి సంబంధించిన ఒప్పంద గడువు లోపు భూసేకరణ పూర్తి చేయలేకపోయారని పేర్కొంది. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదరలేదని విమర్శించింది. ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘ (సీడబ్ల్యూసీ) ఆమోదించినా, లోపాలతో ఉందని, ఆదునిక సాంకేతిక వ్యవస్థను ఇందులో ఉపయోగించలేక పోయారని కాగ్ ఎత్తి చూపింది. ఈ నేపథ్యంలో 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టమేనని వివరించింది. ఆశించిన ఫలితాలు పొందాలంటే తక్షణమే గ్రామాల వారీగా డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే పనుల కన్నా ప్రచారంపైనే దృష్టి పెట్టినట్లు కనపడుతోంది. రోజుకో ప్రకటన, పర్యటన, సమీక్ష, ప్రారంభోత్సవంతో హడావిడికే పరిమితమైంది. ప్రతి సోమవారం…. పోలవరం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్భాటం చేస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది ఆర్భాటం, హడావిడి, ప్రచారం కాదు. పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలి.

Related Posts