రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసుల ఉక్కుపాదం..
చీకటి దందాకు చెక్ పెట్టిన రాజన్న సిరిసిల్ల పోలీసులు..
- జీరో దందాపై జిల్లాలో 11 మంది వడ్డీ వ్యాపారస్తుల అరెస్టు..
- నిందితులలో ఇటీవల వేములవాడలో పేకాట ఆడుతూ దొరికిన ముగ్గురు....
- సిరిసిల్లలో ఐదుగురు , వేములవాడలో ముగ్గురు , ఎల్లారెడ్డిపేటలో ముగ్గురి అరెస్టు........
- జీరో దందాను సహించేది లేదు -జిల్లా ఎస్పీ విశ్వజిత్ కాంపాటి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరుగా సాగుతున్న జీరో దందాకు పోలీసులు చెక్ పెట్టారు. పేద ప్రజలే టార్గెట్ గా చేసుకుని అధిక వడ్డీలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్న వైనాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం బట్టబయలు చేసింది. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట ప్రాంతాల్లో జీరో దందా చేస్తున్న వడ్డీ వ్యాపారులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున ఏకకాలంలో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు , రూ.5,94,131ల నగదుతో పాటు దస్తావేజులు,ప్రామిసరీ నోట్లు,రిజిస్ట్రేషన్ కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకుడు కట్కూరి శ్రీనివాస్ , వ్యాపారులు బుస్స దశరథం , కటకం కిషన్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని..చిట్టీల రిజిస్ట్రర్ లు , బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఇటీవల వేములవాడలో పేకాడ ఆడుతూ పట్టుబడిన సైతం నిందుతులే కావడం గమనార్హం . ఇక సిరిసిల్ల పట్టణంలో ఆడెపు మురళి , పతెం రవీందర్ , దార అశోక్ , వోడ్నాల సత్యనారాయణ , సయ్యద్ షఫీలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి బ్లాంక్ చెక్ లను , ప్రామిసరీ నోట్లు , భూములకు సంబంధించిన కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు వడ్లూరి సత్యనారాయణ , పెట్రోల్ బంక్ యజమాని ప్రేమ్ కుమార్ , చిట్ ఫండ్ నిర్వహిస్తున్న కొండ రమేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం జిల్లా ఎస్పీ విశ్వజిత్ కాంపాటి మీడియాకు వెల్లడించిన వివరాలు సైతం విస్మయానికి గురి చేశాయి. ప్రజల అవసరాలను , పేదరికాన్ని ఆసరాగా చేసుకుని రూ.10ల వడ్డీకి అప్పులు ఇస్తూ బ్లాంక్ చెక్కులను , రిజిస్ట్రేషన్ కాగితాలను తనఖా పెట్టుకుని సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడమే కాక అప్పు చెల్లించని వారిని వేధిస్తూ ఆస్తులు లాక్కుంటున్నారని అన్నారు అప్పులు తీర్చలేక , వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడటం, ఊరు విడిచిపెట్టడం, విదేశాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. జిల్లాలో ఫైనాన్స్ , వడ్డీ వ్యాపారం చేస్తున్న అందరి లిస్టు తమవద్ద ఉందని , ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కూడా చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో జీరో దందా, అక్రమ వ్యాపారాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఎస్పీ వెల్లడించారు.....