భారత-చైనా సరిహద్దుల్లోని టిబెట్ వైపు రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నట్టు మానస సరోవరం నుంచి తిరిగి వచ్చిన యాత్రికులు స్పష్టంచేస్తున్నారు. టిబెట్ పశ్చిమ ప్రాంతంలో పక డ్బందీగా మౌలిక సదుపా యాలు అందుబాటులోకి వచ్చాయని, కానీ మన సరిహద్దు లోపల మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నట్టు యాత్రికులు వెల్లడించారు. గత ఏడాదిగా నాజంగ్ వద్ద పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని వీరు అసంతృప్తి వ్యక్తంచేశారు. గత 10 ఏళ్లుగా కేవలం 18 కిలోమీటర్ల మేర మాత్రమే ఇక్కడ రహదారి నిర్మాణం పూర్తైందని, మొత్తం 61 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందోనని యాత్రికులు అనుమా నాలు వ్యక్తంచేశారు. నిజానికి 2008లో ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమై, 2012లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టు కున్నారని యాత్ర నుంచి తిరిగి వచ్చిన నైనితాల్ వాసులు సుధీర్ వర్మ, సునీత వర్మ గుర్తు చేశారు. ఈ ఏడాదిలోగా సరిహద్దు వరకూ చైనా రహదారి నిర్మాణం పూర్తి చేయడం ఖాయమని వారు వివరిస్తున్నారు. ఓవైపు మనం కనీసం నడక దారి కూడా సరిచేయని దుస్థితిలో ఉంటే మరోవైపు టక్లాకోట్ వరకు 4 లైన్ల రహదారిని చైనా నిర్మిస్తుండడం విశేషమని ఇతర యాత్రికులు అంటున్నారు. వ్యాస్ లోయ వరకు సాగుతున్న నిర్మాణ పనుల్లో జాప్యం జరగదని, 2020 కల్లా పనులు పూర్త వుతాయని సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌ఓ) స్పష్టంచేసిం ది. టిబెట్ పీఠభూమి పైన మానస సరోవరం వరకు రహదారి నిర్మించడం చైనాకు అత్యంత సులువైన పనిగా ఉండగా, పర్వతాలు, లోయలతో కూడిన భారత భూభాగంలో రహదారి నిర్మించేందుకు సమయం ఎక్కువగా పడుతోంది.