ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు రాజకీయ విశ్లషకులు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్నప్పటికీ.. వారిపై ప్రజలలో సదభిప్రాయం లేదని చెబుతున్నారు. మంత్రులుగా ఉండి కూడా జిల్లాపై పట్టుసాధించలేకపోగా.. నియోజకవర్గాల్లోనూ కనీస సౌకర్యాల కల్పనకు వారు నడుం బిగించలేదని అంటున్నారు. దీంతో ఆ ఇద్దరు మంత్రుల చుట్టూ ఇప్పుడు చర్చ మొదలైంది. వారిద్దరూ వేస్ట్! అనే వ్యాఖ్యలు కూడా టీడీపీలోనే ఊపందుకోవడం గమనార్హం. మరి ఆ మంత్రుల కథేంటోతెలుసుకుందాం.. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులు రాజధాని జిల్లా గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రత్తిపాటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. గుంటూరు జిల్లా చిలకలూరిపేట రాజకీయాల్లో ఆరితేరారు. పార్టీ అధికారంలో లేని అత్యంత క్లిష్టమైన సమయంలోనూ ఆయన దివంగత వైఎస్ హవాను ఎదిరించి ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండి, కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనను 2014లో అధికారంలోకి రాగానే మంత్రిని చేసి గౌరవించారు. మరొక మంత్రి నక్కా ఆనందబాబు. ఈయన కూడా సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న నాయకుడే. పైగా టీడీపీలోనే ఉండిపోయారు. ఎస్సీ వర్గానికి చెందిన నక్కా ఆనందబాబు.. వేమూరు నియోజకవర్గం నుంచి వరుస విజయాలను నమోదు చేస్తున్నారు. అయితే, 2014లోనే ఈయనకు మంత్రి పదవి వస్తుందని భావించినా.. రావెల కిశోర్ బాబు కారణంగా ఈయనకు మంత్రి పదవి మిస్సయింది. అయితే, 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఈయనకు చంద్రబాబు అవకాశం కల్పించారు. దీంతో జిల్లా రూపు రేఖలు మారిపోతాయని అనుకున్నారు అందరూ. కానీ, ఈ ఇద్దరు మంత్రుల్లో ప్రత్తిపాటి పూర్తిగా వివాదాస్పదం కావడం గమనార్హం. ఎన్నికలకు మరో ఆరు మాసాలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు సుధీర్ఘ కసరత్తులు చేస్తున్నాయి.ఒకవైపు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిని, ఇన్‌ఛార్జులను మార్చాలని భావిస్తూ ఆ మేరకు ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి ఆనందబాబు మంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని, శాఖలో అవినీతిని కట్టడి చేయలేకపోయారని, అవినీతికి ఆయనే రాచబాట వేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాఖపై పట్టు సాధించ లేకపోయారని, ఎస్సీ, ఎస్టీలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉన్నా ఆయన చేతులారా వదిలేసుకున్నారని, ఆయన కంటే గంతలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన రావెల నయమనే మాట సచివాలయ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆనంద్‌బాబుకు మంత్రిగా అవకాశం ఇస్తే.. ఇలాగేనా పనిచేసేది అనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.ఇక, ప్రత్తిపాటి కూడా ఇదే విధంగా అపఖ్యాతి కూడగట్టుకుంటున్నారు. ఆయన ఫ్యామిలీ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నా.. ఆయన నిలువరించలేకపోతున్నారు. గతంలో ఉన్న శాఖను మార్చినా.. దీనికి కారణాన్ని ఇప్పటికీ గుర్తించకుండానే ప్రత్తిపాటి రాజకీయాలు చేస్తుండడంతో ఆయనపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఈ ఇద్దరు ఉండి కూడా జిల్లాకు ఒరగబెట్టింది ఏమిటనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక వీరు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లోనూ వీరు ప్రత్యర్థుల దెబ్బకు విలవిల్లాడుతోన్నారు.వేమూరులో మంత్రి ఆనంద్‌బాబుపై వరుసగా రెండుసార్లు ఓడిపోయిన మేరుగ నాగార్జునను ఈ సారి గెలిపిస్తే ఎలా ఉంటుందా ? అన్న యోచనతో నియోజకవర్గ ప్రజలు ఉన్నట్టే అక్కడ వాతావరణం చెపుతోంది. నాగార్జునకు సానుభూతి పవనాలు బలంగా ఉన్నాయి. ఇక చిలకలూరిపేటలో తన ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన విడదల రజనీ ఇప్పుడు ఆయనకు ఏకు మేకుగా మారి వైసీపీ నుంచి ఆయనపై పోటీ చేస్తున్నారు. రజనీ జోరుతో పుల్లారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నట్టే పేట వాతావరణం చెపుతోంది. ఏదేమైనా కీలకమైన గుంటూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు శాఖల్లోనూ, నియోజకవర్గాల్లోనూ వెనకపడినట్టే అక్కడ పొలిటికల్ వాతావరణం చెపుతోంది