YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనపై అధికార,ప్రతిపక్ష పార్టీల వ్యూహాత్మక మౌనం

 జనసేనపై అధికార,ప్రతిపక్ష పార్టీల  వ్యూహాత్మక మౌనం
అధికార, ప్రతిపక్షాలు ఉప్పు నిప్పు. ఒక విషయంలో మాత్రం రెండు పార్టీలది ఒకటేమాట. అదే బాట. తమకు ప్రత్యర్థిగా రంగంలోకి వస్తున్న జనసేనాని పవర్ స్టార్ పవన్ పై అపారమైన ప్రేమ కురిపిస్తున్నారు.2019 ఎన్నికలు కష్టంగానే ఉంటాయని తెలుగుదేశం, వైసీపీ అంగీకరిస్తున్నాయి. ఏకపక్షంగా గెలుపు అవకాశాలు ఎవరికీ లేవు. దాదాపు 60 నియోజకవర్గాల్లో నువ్వా? నేనా అన్నతరహాలో పోటీ ఉత్కంఠను రేకెత్తించే సూచనలున్నాయి. ఈ అరవై నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకున్న పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా సమాన స్థానాలలో పార్టీలు రెండూ గెలుచుకుంటే జనసేన చాలా కీలకంగా మారుతుంది. వేయి లోపు ఓట్ల మెజారిటీతో పార్టీలు గెలుచుకునే అరవై స్థానాలను మినహాయిస్తే మిగిలిన స్థానాల్లో అయిదారు సీట్ల తేడాతో టీడీపీ, వైసీపీ సమ ఉజ్జీలుగానే నిలుస్తాయని అంచనాలు వెలువడుతున్నాయి. పతాకస్థాయి పోటీ నెలకొనే సీట్లలో మూడింట రెండువంతుల స్థానాలు ఎవరి సొంతమైతే వారిదే అధికారం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను శాసించడం ద్వారా జనసేన కీ రోల్ లోకి రావాలనేది ఆలోచన. అదే జరిగితే టీడీపీ, వైసీపీలకు అధికారపీఠం అధిష్టించడానికి సమాన అవకాశాలుంటాయి.అప్పుడు జనసేన ఎటువైపు మొగ్గితే అటే అధికారరథం కదులుతుంది సినిమాల్లో హీరోలను సాధారణంగా బాబు అని పిలుస్తూ వంగి వంగి దండాలు పెడుతుంటారు. రాజకీయాల్లో నాయకులను చీల్చి చెండాడుతుంటారు. పవన్ పాలిటిక్స్ లో ఉన్నప్పటికీ పిక్చర్ ఇమేజ్ ‘బాబు’ను చక్కగా కాపాడుతున్నారు ప్రత్యర్థి పార్టీల నాయకులు. ఆయనపై ఈగ వాలకూడదని పరోక్షంగా తమ నాయకులకు చెప్పేశారు. వ్యక్తిగతానికి పోవద్దు. మనపై విమర్శలకు బదులు మాత్రమే ఇవ్వండంటూ సన్నాయి నొక్కులు నొక్కేశారు. దాంతో చెప్పకనే పవన్ తమకు భవిష్యత్తు మిత్రుడని జోస్యం చెప్పేశారు. చంద్రబాబునాయుడు, జగన్ ల ఆంతర్యం ఆయా పార్టీల నాయకులకు అంతుచిక్కడం లేదు. ఏమాశించి ఇంతటి సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. పవన్ పై విమర్శలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలనేది అనధికార ఉత్తర్వుగా ఈ రెండు పార్టీల్లో అమలవుతోంది.‘జనసేనతో మాకెందుకు? మా బాస్ లే పెద్దగా మాట్లాడటం లేదు. పార్టీ నుంచి పెద్దగా పట్టించుకోవద్దంటూ సూచనలు వచ్చేశాయి’ అంటున్నారు టీడీపీ, వైసీపీ నాయకులు. గతంలో పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించి జగన్ తీవ్ర దుమారాన్ని చవిచూశారు. తర్వాత నాలుక కరుచుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. తాను చేసింది రాజకీయంగా పొరపాటని గ్రహించిన జగన్ పవన్ ఊసెత్తడం మానేశారు. భవిష్యత్తులో రాజకీయ అవసరాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి తన ధోరణిని ఆయన సవరించుకున్నారు. పవన్ ను బీజేపీ తమపైకి ప్రయోగిస్తోందంటూ చంద్రబాబు నాయుడు, లోకేశ్ గతంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. లోకేశ్ పై పవర్ స్టార్ నేరుగా అవినీతి ఆరోపణలు చేయడంతో ఎదురు దాడి చేయడం మొదలు పెట్టారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన జోలికి వెళ్లకూడదని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, అగ్రనాయకులకు ఈ మేరకు టీడీపీ సమాచారాన్ని ఇచ్చింది. అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తమపై వ్యక్తిగతంగా పవన్ విమర్శలు చేస్తే బదులుగా స్పందించారు. దీనిపై కూడా టీడీపీ అధినాయకత్వం జాగ్రత్తలు చెప్పింది.పవన్ కల్యాణ్ ఇటీవలనే తమ ప్రత్యర్థులకు పరోక్షంగా స్నేహహస్తం అందించారు. రేపటి ముఖ్యమంత్రిని నిర్ణయించేది తామేనని ప్రకటించారు. వైసీపీ, టీడీపీలు రెంటికీ మెజార్టీ రాదని జోస్యం చెప్పారు. రెంటిలో ఏది అధికారంలోకి రావాలో తామే నిర్ణయిస్తామని చెప్పారు. అంటే రెండు పార్టీలకు సమ అవకాశాలు కల్పిస్తున్నట్లే భావించాలని పరిశీలకులు పేర్కొంటున్నారు. పవన్ విమర్శలు కొనసాగిస్తున్నప్పటికీ గతంలోని తీవ్రత తగ్గిపోయిందని అభిమానులే చెబుతున్నారు. ఒక వేళ తాము 15శాతం ఓట్లతో 30 సీట్ల పైచిలుకు సాధించగలిగితే రెండు పార్టీలతో బేరసారాలు సాగించవచ్చనేది జనసేన ఆంతర్యం. కర్ణాటకలో జేడీఎస్ తరహాలో అద్రుష్టం కలిసివస్తే పవన్ సీఎం అయిపోతారనేది పార్టీ అభిమానుల ఆశ. అదే జరిగితే నిజానికి జనసేనకు పండగే. పదిహేనుశాతం ఓట్లు తెచ్చుకుంటే ముఖ్యమంత్రి పీఠం దక్కడం చిన్నవిషయం కాదు. కానీ జనసేన ఆ దిశలోనే ఆలోచన చేస్తోంది. ఈలోపు రెండు పార్టీలు తమపట్ల పూర్తి శత్రుభావాన్ని పెంచుకోకుండా జాగ్రత్త పడుతోంది. సొమ్ము ఒకరిది. సోకు ఒకరిది తరహాలో అధిక ఓట్లు, సీట్లు ఆ రెండు పార్టీలు తెచ్చుకుంటే వాటిమద్య ఉన్న వైరాన్ని సాకుగా చేసుకుంటూ తాము అధికారంలోకి రావాలనేది ప్లాన్. లేకపోతే పక్కా షరతులతో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వాలని యోచన. తమ ప్రణాళికకు పెద్దపీట వేస్తేనే మద్దతు అంటూ ముందస్తుగానే షరతులపై కూడా కసరత్తు చేసేస్తోంది జనసేన.

Related Posts