గన్నవరం నుంచి దిల్లీకి మరో భారీ విమాన సర్వీసు ఆరంభమైంది. విమానాశ్రయం నుంచి 72 సీట్ల చిన్న ఏటీఆర్ విమాన సర్వీసులనే ఇప్పుడువరకూ ఇండిగో నడుపుతోంది. మొదటిసారి 180 సీట్లు ఉండే ఎయిర్‌బస్‌ను గన్నవరం విమానాశ్రయం నుంచి డిల్లీకి ప్రారంభించింది. దీంతో దిల్లీకి ఇప్పటివరకూ మూడు ఎయిరిండియా సర్వీసులు గన్నవరం నుంచి నడుస్తుండగా.. ఇది నాలుగోది. డిల్లీలో మధ్యాహ్నం 13.25 గంటలకు ప్రారంభమై.. విజయవాడకు 03.20కు చేరుకుంది. 65 మంది ప్రయాణికులతో అక్కడి నుంచి వచ్చింది. విమానం గన్నవరం చేరుకున్న వెంటనే.. అగ్నిమాపక వాహనాల ద్వారా నీటిని గాలిలోకి చిమ్ముతూ.. ఘనంగా స్వాగతం పలికారు.విమానాశ్రయం డైరెక్టర్ జి.మధుసూదన్‌రావు, ఇండిగో స్టేషన్ మేనేజర్ కౌశిక్ ఆధ్వర్యంలో విమానం వద్దకు చేరుకుని సిబ్బందిని అభినందించి కేక్ కట్ చేశారు. దిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌బస్‌కు విజయవాడకు చెందిన రాజేష్ చంద్ పైలెట్‌గా ఉన్నారు. ఈ తాజా విమాన సర్వీసుతో ఢిల్లీ విమాన టిక్కెట్ల కోసం ప్రయాణికులు పడుతున్న అవస్థలు కొంతవరకూ తగ్గనున్నాయి. విజయవాడ నుంచి నిత్యం వెళ్లే మూడు దిల్లీ విమాన సర్వీసులకు భారీగా డిమాండ్ ఉంటోంది. నిత్యం 80శాతం ఆక్యుపెన్షీతో నడుస్తున్నాయి. ఎయిరిండియా మొదట ఢిల్లీకి నిత్యం ఒక సర్వీసును ప్రారంభించింది. తర్వాత.. డిమాండ్‌ను బట్టి మరో రెండు సర్వీసులను ఆరంభించింది.వీటిలో రెండు మాత్రమే నేరుగా గన్నవరం నుంచి దిల్లీకి ఉండగా.. ఒక సర్వీసు హైదరాబాద్ మీదుగా నడుస్తోంది. తాజాగా ఇండిగో ఎయిర్‌బస్‌ను ఢిల్లీకి ఆరంభించింది. మధ్యాహ్నం 13.25కు దిల్లీలో బయలుదేరి 3.20కు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4.10కు బయలుదేరి దిల్లీకి 6.10కి చేరుతుంది. దిల్లీకి ఇప్పటివరకూ ఎయిరిండియా సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఢిల్లీకి టిక్కెట్ ధర రూ.6 వేలకు పైన ఉంటోంది